చీకటి ఒప్పందం.. మూడు రాజధానుల నివేదిక ఇచ్చిన బోస్టన్ గ్రూప్ తో రూ. 6 కోట్ల డీల్!

మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. 

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.