దిగ్విజయ్ ఇంటికి గవర్నర్ వెళ్ళొచ్చా?

 

 AP Governor CM meets Digvijay Singh, Digvijay Singh, telangana state, governor ESL Narasimhan

 

 

రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి వివరించడానికి ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యుపీఎ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పలువురు కేంద్రమంత్రుల్ని, కీలక అధికారులను కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను పూస గుచ్చినట్టు వివరించారు. అంతవరకూ ఓకే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ని ఆయన ఇంటికి వెళ్ళి మరీ నరసింహన్ కలవటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమైంది.

 

దిగ్విజయ్‌సింగ్ ఇంటికి వెళ్ళిన సమయంలో గవర్నర్ చేతిలో అధికారిక అంశాలకు చెందిన ఫైల్ కూడా ఉందని తెలుస్తోంది. గవర్నర్ హోదాలో వున్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని ఇంటికి వెళ్ళి కలవటం, అది కూడా అధికార పర్యటనలో ఉన్నప్పడు కలవటం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దిగ్విజయ్‌సింగ్‌ని నరసింహన్ కలవటం పలు ఊహాగానాలకు కూడా తావిచ్చేలా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.



బాధ్యతాయుతమైన పదవిలో వున్న గవర్నర్ విమర్శలు తలెత్తే విధంగా వ్యవహరించడం కూడా మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే విభజన సమస్య అత్యంత సున్నితంగా మారిన పరిస్థితుల్లో గవర్నర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. ఏ ప్రాంతం వారిలోనూ ఎలాంటి అపోహలు, అనుమానాలు కలగకుండా వ్యవహరించాల్సి వుంటుంది. అన్నీ తెలిసిన వారు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు. ఇది కూడా అలాంటిదేనేమో!