భలే మంచి చౌక బేరం.. విజయవాడ నడిబొడ్డున రూపాయికే ఐదెకరాల స్థలం!!

 

'భలే మంచి చౌక బేరము' అనే సాంగ్ వినే ఉంటారు. ఇప్పుడు ఈ న్యూస్ వింటే అదే సాంగ్ పాడుకుంటారు. విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న ఖరీదైన ఐదెకరాల స్థలాన్ని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ దక్కించుకున్న సంస్థకి రూపాయికే లీజుకిస్తారట. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయడం.. ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సంచలనం అవుతోంది.

ఏపీఎస్ఆర్టీసీ 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రిబిడ్డింగ్ సమావేశానికి ముందే.. ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేశారు. అప్పుడే.. పోలవరం రివర్స్ టెండర్లను తక్కువకు వేసిన సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్ కంపెనీకి డబుల్ రేట్లకు.. టెండర్ కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగింది. అదే సంస్థ తెలంగాణలో కి.మీ రూ. 36కి ఎలక్ట్రిక్ బస్సులను ఆపరేట్ చేస్తోంది. ఏపీలో మాత్రం రూ. 60 అడిగినట్లుగా తెలుస్తోంది. ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారం అని చర్చ జరుగుతోంది. 

అయితే.. బస్సుల కాంట్రాక్ట్ మాత్రమే కాదు.. ఆ కంపెనీ అత్యంత విలువైన ఆర్టీసీ భూముల్ని కూడా కట్టబెట్టబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. విజయవాడలో విద్యాధరపురం, గన్నవరంలలో ఆర్టీసీకి విలువైన స్థలాలు ఉన్నాయి. మార్కెట్‌ రేటు ప్రకారం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుంది. సిటీ డివిజన్‌ పరిధిలో ఎలక్ర్టిక్‌ బస్సుల నిర్వహణ కోసం మెయింట్‌నెన్స్‌ డిపోలను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆర్టీసీ అధికారులే ఈ రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. అయితే మెయింట్‌నెన్స్‌ డిపోకు కేటాయించే స్థలాలను సంవత్సరానికి రూపాయికి అద్దెకు ఇస్తున్నట్టు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) లో సూచించటం ఇప్పుడు దుమారాన్నే రేపుతోంది. కి.మీ లెక్కల ఖర్చులు ఆర్టీసీ చెల్లిస్తున్నప్పుడు.. నిర్వహణ, మెయింట్‌నెన్స్‌ మొత్తం సదరు కంపెనీనే పెట్టుకోవాలి. కానీ.. నిర్వహణ, మెయింట్‌నెన్స్‌ భారం ఆర్టీసీపై పడేలా.. స్థలాన్ని ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆర్టీసీలో సాధారణ బస్సులను అనేకం అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు. అద్దెకు బస్సు ఇచ్చేవాళ్లే బస్సును సొంతంగా నిర్వహించుకుంటారు. డ్రైవర్‌ యజమానికి చెందిన వారు ఉంటే.. కండక్టర్‌ మాత్రం ఆర్టీసీకి చెందిన వారు ఉంటారు. వ్యాపారం అతనే చేస్తున్నాడు కాబట్టి.. మెయింట్‌నెన్స్‌ కూడా అతనే చేసుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం.. ఆ భారం మొత్తం ఆర్టీసీపై వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అద్దె ప్రాతిపదికన తీసుకునే బస్సుల కోసం సంస్థ ఆస్థులను అప్పనంగా కట్టబెట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా కార్పొరేట్‌ స్థాయి కలిగిన బల్క్‌ సప్లయిర్‌కు ఈ విధంగా అప్పనంగా కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను అప్పగించాలను కోవటం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన తీసుకునే సాధారణ బస్సుల విషయంలో ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో.. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కూడా ఆర్టీసీ అధికారులు అదే వైఖరిని అవలంభించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.