ఏపీలో నిధుల కొరత..ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురు చూపులు!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగంగా పాలన సాగిస్తుందని సర్వత్రా టాక్ నడుస్తోంది. అయితే అది మాటలకు మాత్రమే పరిమితమని కూడా కొన్ని ఘటనలను బట్టి తేటతెల్లమౌతుంది. అదెలాగంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అన్నదాతలకు అండగా ఉంటామని, ధాన్యమంతా కొంటామని, ప్రతి గింజ సేకరిస్తామని, డబ్బులు వెంటనే జమ చేస్తామని, ధాన్యం కొనుగోళ్లకు ముందు అమాత్యులు చేసిన ప్రకటన ఇది. ఇపుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ సేకరణ కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతులు డబ్బు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అక్షరాలా 2040 కోట్ల 12లక్షల రూపాయలను ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్ ధాన్యంలో పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంకా 30శాతం సొమ్ము రైతులకు చెల్లించాల్సి వుంది. ధాన్యం ఇచ్చి రోజులు, నెలలు గడుస్తున్నా సొమ్ము కోసం ఎదురు చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

అదేవిధంగా ప్రైవేటు వ్యాపారులుకు అమ్ముకుంటే ఇన్నాళ్లు ఆగాల్సిన పరిస్థితి ఉండేది కాదని రైతులు వెల్లడిస్తున్నారు. డబ్బు చేతికొస్తే రెండో పంటకు పెట్టుబడులకు ఉపయోగపడతాయని రైతులు ఆశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ లో 1710 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగింది. గత మూడు నెలల్లో 3 లక్షల 97 వేల 189మంది రైతుల నుంచి 40 లక్షల 80వేల 579 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. ఈ మొత్తానికి 7,421.32 కోట్లు చెల్లించాల్సి ఉండగా 5,381.20 కోట్లు జమ చేసింది. ఇంకా 2040.12 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా రైతులకు అత్యధికంగా 573 కోట్లు చెల్లించాల్సి ఉంది. విజయనగరం జిల్లా రైతులకు 433 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉంది. శ్రీకాకుళం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరగాల్సి ఉండగా... అందుకు నిధుల కొరత వల్లే చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ సిబ్బంది వెల్లడిస్తున్నారు.