నిమ్మగడ్డ రాకతో సీఎస్‌ నీలం సాహ్ని పదవికి గండం!!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్‌ సెక్రెటరీ గా ఉన్న నీలం సాహ్ని జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఈ కరోనా కష్టకాలంలో సీఎస్‌ విధులు కీలకమైనందున.. ఆమె పదవీ కాలం మరో ఆరునెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు ఊహించని విధంగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ రీఎంట్రీ ఇవ్వడంతో.. సీఎస్ పదవికి గండం ఏర్పడిందని అంటున్నారు.

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడం. ప్రభుత్వం పంతానికి పోయి.. ఆయన్ని ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా తొలగించి, ఆయన స్థానంలో కనగరాజ్‌ని నియమించడం. తాజాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ‌ని కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం.. ఇవన్నీ తెలిసినవే. అయితే, నిమ్మగడ్డ రీఎంట్రీతో కొంతమంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే సమయంలో కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించారు. అయితే ఆదేశాలను చీఫ్‌ సెక్రెటరీ నీలం సాహ్ని అమలు చేయలేదు. నిమ్మగడ్డని తొలగించడంతో ఆయన ఆదేశాలు మరుగునపడ్డాయి. కానీ, ఇప్పుడు ఆయన రాకతో, ఆ ఆదేశాలు అమలవుతాయని అధికారాలు భయపడుతున్నారు.

ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను ప్రస్తుతం సీఎస్ పక్కన పెట్టే పరిస్థితి లేదంటున్నారు. ఒకవేళ పక్కన పెడితే, ఆమె పదవికే గండమంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇలానే ఈసీ ఆదేశాలను పక్కన పెట్టినందుకు అప్పటి సీఎస్‌ పునేఠాని ఏకంగా విధుల నుంచి తప్పించి, ఆయన స్థానంలో ఎల్‌వీ సుబ్రహ్మణ్యంని తీసుకొచ్చారు. ఈసీ ఆదేశాలను పక్కన పెడితే, నీలం సాహ్నికి కూడా పునేఠా విషయంలో జరిగినదే పునరావృతమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ నీలం సాహ్ని.. అధికారులకు సంబంధించి నిమ్మగడ్డ‌ జారీచేసిన ఆదేశాల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.