దొంగలనుకొని పోలీసులను బంధించిన గ్రామస్తులు

 

నేరస్తులను పట్టుకోడానికి పోలీసులు మఫ్టీలో తిరుగుతుంటారు.కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. మఫ్టీలో ఓ నిందితుడిని పట్టుకొనేందుకు తమిళనాడుకు వెళ్లిన ఆంధ్ర పోలీసులను దొంగలుగా భావించిన అక్కడి గ్రామస్తులు వారిని పట్టుకుని ఇంట్లో పెట్టి తాళాలు వేసారు.

సత్తువాచేరి మేలకుప్పం కొండ ప్రాంతంలోని ఇలవన్‌తోపుకు చెందిన రామకృష్ణన్‌ పై  ఆంధ్ర రాష్ట్రం అనంతపురం జిల్లా ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో 40కి పైగా దోపిడీ కేసులున్నాయి. అతడి కోసం గాలిస్తున్న పోలీసులకు ఇలవన్‌తోపులో రామకృష్ణ తల దాచుకున్నట్లు సమాచారం అందింది. దీంతో ధర్మవరం ఎస్‌ఐ సిరిహర్ష నేతృత్వంలో ఐదుగురు పోలీసులు రాత్రి వేళలో మఫ్టీలో ఇళవన్‌తోపుకు చేరుకుని రామకృష్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో, అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మఫ్టీలో వచ్చిన ఆంధ్ర పోలీసులను దొంగలుగా భావించి ఓ ఇంట్లో తాళం వేశారు. సమాచారం అందుకున్న రత్నగిరి పోలీసులు అక్కడకు వెళ్లి వారు ఆంధ్ర పోలీసులని నిర్ధారించారు. ఇంతలో రామకృష్ణన్‌ పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం అక్కడే రామకృష్ణన్‌ ని  అరెస్ట్‌ చేసిన ఆంధ్ర పోలీసులు అతడిని చిత్తూరుకు తీసుకెళ్లారు.