జగన్ సర్కార్ కి మరో షాక్...కేంద్రమే కారణమంటున్న సీఎంవో !

 

అమరావతికి నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ప్రపంచ బ్యాంక్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రుణం ఇవ్వకపోవడానికి మీరంటే మీరు కారణమని అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ప్రపంచ బ్యాంక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే మరో బ్యాంకు కూడా హ్యాండ్ ఇవ్వచ్చని ప్రచారం జరగగా ఇప్పుడు ఆ విషయాన్ని నిజం చేస్తూ అమరావతి ప్రాజెక్టుకి ఇస్తామన్న ఋణం విషయంలో తాము  తప్పుకుంటున్నట్లు ఏసియన్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ప్రకటించింది. 

రాజధాని అమరావతికి 200 మిలియన్ డాలర్ల రుణం ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ఏసియన్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) తెలిపింది. అమరావతిని సుస్థిరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌గా భావించడం లేదని, అందుకే రుణ ప్రతిపాదన నుంచి వైదొలుగుతున్నామని పేర్కొంది. కాగా ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఏఐఐబీ కూడా రుణ సాయంపై వెనక్కి తగ్గడంతో ప్రభుత్వానికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే  ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నట్టు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అమరావతికి ప్రపంచబ్యాంకు తన ప్రతిపాదిత రుణాన్ని నిలిపివేసిందని సీఎంఓ వర్గాలు మరోసారి పేర్కొనగా, అమరావతికి ఋణం ఇచ్చే విషయంలో వరల్డ్‌ బ్యాంకుతో పాటు ఏఐఐబీ కూడా పార్టనర్ అని కేంద్రం తీసుకున్న నిర్ణయం వలన ఈ ప్రాజెక్టులోని భాగస్వాములందరికీ వర్తిస్తుందని సీఎంఓ వర్గాలు పెర్కొనట్టు చెబుతున్నారు. అమరావతిలో మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అంచనా వ్యయం 715 మిలియన్‌ డాలర్లు కాగా అందులో ప్రపంచబ్యాంకు 300 మిలియన్‌ డాలర్లు, ఏఐఐబీ 200 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. 

మిగతా 215 మిలియన్‌ డాలర్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలన్నది గత ప్రభుత్వ సమయంలో చేసిన ప్రతిపాదన. అయితే అమరావతికి రుణం విషయంలో చెకింగ్ లు లాంటివి కుదరవని చెప్పడంతో పాటు ఋణం కోసం చేసిన విజ్ఞప్తిని కూడా వెనక్కు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఏఐఐబీ సైతం నిర్ణయం తీసుకుంది. మరి ఈ విషయం మీద పాలకప్రతిపక్షాలు ఏమంటాయో వేచి చూడాలి మరి ?