బోటు యాక్సిడెంట్ స్పాట్‌కి జగన్... పాపికొండల బోటు రైడింగ్‌పై కీలక ప్రకటన..!

గోదావరిలో పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు 10లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. మరికాసేపట్లో స్పాట్ కి వెళ్లనున్న సీఎం జగన్ ...హెలికాప్టర్ ద్వారా ఘటనాస్థలిని పరిశీలించనున్నారు. అలాగే రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం పడవ ప్రమాదంపై జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.
 
మరోవైపు గోదావరిలో బోటు సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.... అసలు ప్రయాణానికి ఆ బోట్లు అనుకూలమా? కాదా?... బోటు డ్రైవర్లకు, సిబ్బందికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లైసెన్సులు ఉన్నాయా? ముందస్తు జాగ్రత్తలు బోట్లలో ఉన్నాయా? లేదా? ఇలా ప్రతి చిన్న అంశాన్నీ నిపుణులతో పరిశీలించి, పటిష్టమైన మార్గదర్శకాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇదిలాఉంటే, గోదావరిలో గల్లంతైనవారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రులు, అధికారులు... దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరిలో గాలిస్తున్నాయి. గల్లంతైనవారు కొట్టుకుపోకుండా ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మూసివేశారు.