నేడు పోలవరం, రేపు కాళేశ్వరం!!

 

ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శిస్తున్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ అంచనా పెంచి అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ నేతలు చెప్పినంత శాతం పోలవరం నిర్మాణం పూర్తీ కాలేదని కూడా వైసీపీ చేప్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పోలవరంపై సమీక్ష నిర్వహించిన జగన్.. సందర్శించిన తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. సీఎంగా ప్రమాణం చేసిన తరువాత జగన్ మొదట.. పోలవరంతో సంబంధంలేదు దాని బాధ్యత కేంద్రానికి అన్నారు. కానీ తరువాత కేంద్ర సహకారంతో పూర్తీ చేయాలనీ అనుకుంటున్నారు. మరి పోలవరం విషయంలో ఇకపై జగన్ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.

మరోవైపు.. జగన్ రేపు (శుక్రవారం) తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి కూడా వెళ్తున్నారు. గతంలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ 3 రోజులు జలదీక్ష చేసారు. కేసీఆర్ ఏపీని సంప్రదించకుండా, నీళ్ల వాటా తేల్చకుండా, ఏపీకి అన్యాయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏపీ సీఎం హోదాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటూ.. ఏపీకి న్యాయం చేస్తా అంటున్నారు. మరి ఒకప్పుడు కాళేశ్వరం విషయంలో ఎవడబ్బ సొత్తు అంటూ కేసీఆర్ మీద విరుచుకుపడిన జగన్.. మరి రేపు ప్రాజెక్ట్ గురించి, కేసీఆర్ గురించి ఏం మాట్లాడతారా అన్న ఆసక్తి నెలకొంది.