పేదల ఇళ్ల స్థలాల కోసం అమరావతి భూములు.. రైతులకి మరింత కష్టం!!

ఉగాది పండుగ నాటికి ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సీఎం జగన్ రెవిన్యూశాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాల కోసం సుమారు 14,000 ఎకరాలు సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రమంతా భూసేకరణ చేయడం ఒక ఎత్తయితే విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చేయటం మరొక ఎత్తు. ఇక్కడ భూసమీకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. విజయవాడ, గుంటూరు నగరాలు వాటి చుట్టు పక్కల ఉన్న పేదలకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో భూమి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అమరావతి లోని భూమినే పేదలకు పంపిణీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.

విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన కొందరు లబ్ధిదారులకు రాజధాని పరిధిలో అందుబాటులో ఉన్న భూమిలో పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రాలను తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పేదల ఇళ్ల స్థలాల కోసం అమరావతిలోని శాఖమూరు, పెనుమాక, కృష్ణాయపాలెం సమీపంలోని మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ గుర్తించినట్టు తెలుస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియాలోని గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రస్తుత సమాచారం ప్రకారం అనంతపురం, ఐనవోలు, మందడం, కురగల్లు, నెక్కల్లు, నేలపాడు, నిడమర్రు, నవులూరు, పిచ్చుకలపాలెం వంటి గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పేదల ఇళ్ల పట్టాల కోసం గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే కొండమరాజుపాలెం, లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం వంటి గ్రామాల్లో కూడా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని గుర్తించినట్లు తెలుస్తోంది. 

రాజధాని ప్రాంత రైతులు అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలంటూ 60 రోజులకు పైగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భారీ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు ఇదే ప్రాంతం లోని భూములను పేదలకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజధాని రైతులు ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. తాము రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చామని, ఇంటి స్థలాల కోసం కాదని రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశమున్నట్లు సమాచారం అందుతుంది.