జగన్ షాకింగ్ కామెంట్స్.. పవన్ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?

 

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొందరు సమర్దిస్తుండగా మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. సోమవారం మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. ఇంగ్లీష్ బోధనపై విమర్శలు చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

'రాజకీయ దురుద్దేశంతోనే ఇంగ్లీష్‌ మీడియంను తప్పుబడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగీష్ బోధన అని వారం రోజుల క్రితం జీవో ఇచ్చాం. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారి నోళ్లు తెరచుకున్నాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ జీవోను విమర్శిస్తూ వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు?. ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఒక్కసారి ఆలోచించాలి. ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించేవారు.. వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారు?. యాక్టర్ పవన్ కు ముగ్గురు భార్యలు, నలుగురైదుగురు పిల్లలు.. ఆ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు.?' అంటూ జగన్ విరుచుకుపడ్డారు.

ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివితేనే పోటీ ప్రపంచంలో పిల్లలు గెలవగలరని.. అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని జగన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం తప్పనిసరని, తెలుగు లేదా హిందీ రెండో భాషగా ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోనే ఉంటుందని.. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతూ.. నాలుగేళ్లలో పదో తరగతి వరకు అమలు చేస్తామని జగన్ తేల్చిచెప్పారు.