గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌లు రిలీజ్‌ చేసేవారు

ఏపీ సీఎంగా‌ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్బంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను వైఎస్‌ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి  ఏకకాలంలో 10,641 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్‌ వీడియో ద్వారా వీక్షిస్తూ సీఎం ఆరంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ రైతులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అన్నీ రైతుభరోసా కేంద్రాల్లో లభ్యం అవుతాయని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, రైతు భరోసా ద్వారా 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.10,200 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

"కేవలం రెండు పేజీల్లోనే మేనిఫెస్టో పెట్టాం. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి అధికారి దగ్గరా మేనిఫెస్టోను ఉంచాం. మేం ఇచ్చిన 129 హామీల్లో ఇప్పటికే 77 అమలు చేశాం. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 16 హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తాం. మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశాం" అని సీఎం చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌లు రిలీజ్‌ చేసేవారని సీఎం ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 600లకుపైగా హామీలిచ్చి, పది శాతం కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకు.. అన్నీ తమ కనుసన్నల్లోనే ఉండాలని గత ప్రభుత్వం కోరుకునేదని విమర్శించారు. ఆంగ్ల మాధ్యమాన్నీ అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నా అని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దక్కాలంటే జన్మభూమి మాఫియాకు లంచాలు ఇవ్వాల్సిందే. కానీ, తమ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికే వెళ్లి పథకాలు అందిస్తున్నాం అని సీఎం‌ జగన్‌ పేర్కొన్నారు.