నాలుగు నెలల వ్యవధిలోనే సచివాలయ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఏపీ సర్కార్...

 

గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏపీ సర్కార్ ప్రారంభించింది. తూర్పుగోదారి కరపలో జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిచోటా పది నుండి పన్నెండు మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం, జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరు నుంచి ఏడు సచివాలయాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డ్ సచివాలయాలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఈ సచివాలయాల్లో పని చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో లక్షా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది.

కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. పింఛన్ లు, రేషన్ కార్డులు ఇంటి పట్టా వంటి వాటి కోసం పేదల మండల ఆఫీసులు, కలెక్టరేట్ రాజధానిలో ఉండే శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కేవలం 19 రకాల సేవలు పంచాయతీల ద్వారా అందజేసే అధికారముంది, ఈ పరిస్థితిని మార్చేస్తూ 500 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అక్టోబర్ 2 వ తేదీ నుంచి ప్రతీ నెల కొన్ని సేవల చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తారు. జనవరి 1వ తేదీ కల్లా 500 రకాల సేవలను ప్రజలు పూర్తిగా గ్రామ సచివాలయాల్లోనే పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సేవలు అందజేసే విషయంలో నిర్దిష్ట కాల పరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా శాఖల పరిధిలో జరిగే పనులను గ్రామ సచివాలయం అనుమతితో చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ప్రతి అభివృద్ధి పని, ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారుల పేర్లను అక్కడి ప్రజలందరి సమక్షంలో చేర్పించి నిర్ణయించాలనీ, ఏడాదిలో తప్పని సరిగా ఎనిమిది సార్లు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాలో అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలను సైతం సచివాలయంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు.