పోలవరం ప్రాజెక్టు రీడిజైనింగ్? కేసీఆర్-జగన్ భేటీ వెనుక సీక్రెట్ ఇదేనా?

 

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నం జరుగుతుందనే మాట వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.... కేవలం ఎత్తు వల్లే తెలంగాణ, ఒడిషాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం... పోలవరం ఎత్తు తగ్గించేందుకు అంగీకరిస్తే, సమస్యలన్నీ సమసిపోతాయని చెప్పుకొచ్చారు. అయితే, పోలవరం ఎత్తు తగ్గించాలని తాను ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని, అందుకు జగన్ అంగీకరించారంటూ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించి కేసీఆర్ కలకలం రేపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే, ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందనే టాక్ వినిపిస్తోంది.

అయితే, కేసీఆర్ ప్రకటనపై అటు చంద్రబాబు... ఇటు ప్రజాసంఘాల నేతలు ఆనాడు మండిపడ్డారు. కేసీఆర్, జగన్ ఎవరైనాసరే పోలవరం ప్రాజెక్టు జోలికొస్తే ఊరుకునేది లేదని బాబు హెచ్చరించారు. 71శాతం పూర్తయిన ప్రాజెక్టుపై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఏపీ సీఎం ఒప్పుకున్నారంటోన్న కేసీఆర్ కి ఆంధ్రా పరిస్థితులు ఏం తెలుసని ప్రశ్నించారు. అసలు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కేసీఆర్ ఎవరని చంద్రబాబు నిప్పులు చెరిగారు. 55లక్షల క్యూసెక్యుల నీటిని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేశారని, అందువల్ల ప్రాజెక్టు భద్రతతో రాజకీయ ఆటలాడొద్దని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఏదైనా జరగరానిది జరిగితే గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదని హెచ్చరించారు.

అయితే, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, తాను అనుకున్నదే చేసుకుంటూ పోతున్న జగన్మోహన్ రెడ్డి... పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఓకే చెప్పారనే మాట వినిపిస్తోంది. కారణాలు ఏమైనా, కేసీఆర్ మాటకు జగన్ అధిక విలువ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా జగన్ కు కేసీఆరే ముఖ్యసలహాదారుగా మారారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఏం చెబితే దానికి జగన్ ఎస్ అంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు కూడా జగన్ సానుకూలంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రుల మీటింగ్ లో పోలవరం ఎత్తు తగ్గింపు అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. రహస్య అజెండాగా పోలవరం ఎత్తు తగ్గింపుపై ఇద్దరి మధ్య చర్చలు సాగాయని అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ ప్రకటించినట్లుగా, పోలవరం ఎత్తు తగ్గింపునకు జగన్ ఒప్పుకుంటే, అది ఏపీలో కలకలం రేపే అవకాశం ఉంది. అలాగే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. అంతేకాదు కేసీఆర్ చెప్పినట్లుగా పోలవరం ఎత్తు తగ్గిస్తే... 196 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యమున్న ప్రాజెక్టులో 60 టీఎంసీలు తగ్గిపోయి... 130 టీఎంసీలకు పడిపోతుందని, అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం తప్పదని, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, కేసీఆర్ మాటలకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలని చూసినా, ప్రజల మనోభావాలతో ఆడుకున్నా, జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం.... రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణకు తాకట్టు పెడితే, పెద్దఎత్తున ప్రజాఉద్యమాలు చేపడతామని తెలుగుదేశం లీడర్లు అంటున్నారు.