ఆరోగ్య మిత్ర ఉద్యోగుల జీతాలు రెట్టింపు చేసిన జగన్ సర్కార్

 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలతో మొదలుకుని జీతాల పెంపు వరకు అన్ని నెరవేరుస్తూ.. నిరోద్యోగులకు ఉపాధి కల్పన కూడా కల్పిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టులో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు, టీమ్‌ లీడర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వేతనాలను రెట్టింపు చేస్తున్నట్లుగా ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి. 

నవంబర్ 15న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆరోగ్య మిత్రల వేతనం రూ.6వేలు, టీమ్‌లీడర్ల వేతనం రూ.10వేల 600గా ఉంది. ఆ ఉద్యోగుల వేతనాలు పెంచిన తర్వాత ఆరోగ్య మిత్రలు(పీహెచ్‌సీ ఆరోగ్యమిత్ర/నెట్‌వర్క్‌ ఆరోగ్య మిత్ర) రూ.12వేలు, టీమ్‌ లీడర్లు రూ.15వేలు జీతంగా అందుకోనున్నారు.

వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నామని.. ఈ తరుణంలో జీతాలు పెంచడం కొంత ఊరట కలిగించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.