ప్రవాసాంధ్రుల సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము హత్యలను అందరు ఖండించాలని పిలుపునిచ్చారు. హత్యలకు, విధ్వంసానికి ప్రజాస్వామ్యంలో తావులేదని అన్నారు. ప్రాణం పోసే ప్రతిభ లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు కూడా ఎవరికి లేదని స్పష్టం చేశారు. నిర్మాణమే అందరి బాధ్యత కావాలి తప్ప.. విధ్వంసం నైజం కారాదని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రవాసాంధ్రులకు ఓటుహక్కు వస్తోందని, అమెరికా నుంచే వారంతా ఓటేయవచ్చని తెలిపారు.

 

 

ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటి మీద పెట్టిన శ్రద్ధ వల్లే ఈరోజు ఇంతమంది అమెరికా రాగలిగారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. వందలాది ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పడం వల్లే రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రతిభ పెరిగిందని అన్నారు. దూరం అనేది పెద్ద సమస్య కాదని, సొంత గ్రామానికి ఏం చేయాలో ప్రవాసాంధ్రులు ఆలోచించాలని కోరారు. అమెరికాలోని అన్ని నగరాల్లో తెలుగువారు ఉన్నారని.. వారంతా అటు వృత్తిలో రాణిస్తూనే, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారని ప్రశంసించారు. సమాజ సేవలో ముందున్న ప్రవాసాంధ్రులందరికీ అభినందనలు తెలిపారు. ఇటీవలే అమెరికాలో లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు బ్రహ్మాండంగా నిర్వహించారని.. అదే స్పూర్తిని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు. ఏ పార్టీ వల్ల పైకి వచ్చామో ఆ పార్టీకి ప్రచారం చేయడం అందరి బాధ్యతని తెలిపారు. ప్రపంచ దేశాలలో పసుపు జెండా రెపరెపలాడుతుందని ఎవరూ ఊహించలేదన్న చంద్రబాబు.. ఇది ఒక రాజకీయ పార్టీకి దక్కిన అపూర్వ గౌరవంగా పేర్కొన్నారు.