మోడీ సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించిన బాబు

 

ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడం, కేంద్రం మీద విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.. అయితే అవకాశం దొరికితే కేంద్రాన్ని డైరెక్ట్ గా అడగాలని చూస్తున్న బాబుకి, నీతి ఆయోగ్ రూపంలో అద్భుత అవకాశం దొరికింది.. ఇంకేముంది మోడీ సాక్షిగా బాబు కేంద్రాన్ని అడిగేసారు.. మాట్లాడటానికి 7 నిమిషాలే సమయం అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బాబు ప్రసంగాన్ని ఆపే ప్రయత్నం చేసారు.. అయినా బాబు వినకుండా ఏపీకి ప్రత్యేక సమస్యలు ఉన్నాయి, మాట్లాడటానికి ఎక్కువ సమయం కావాలంటూ సుమారు 20 నిమిషాలపాటు ప్రసంగించారు.. ఏపీ ప్రజలు విభజన కోరుకోలేదని, విభజన ఏకపక్షంగా జరిగి ఏపీకి అన్యాయం జరిగింది అన్నారు.

ప్రత్యేకహోదా మరియు విభజన హామీలన్నీ నెరవేర్చాల్సిందే అన్న బాబు.. గత ప్రధాని ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్నారు, బీజేపీ కూడా ఎన్నికల సమయంలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తానని మాట ఇచ్చింది.. ఆ మాట ప్రకారం ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అంటూ బాబు సూటిగా చెప్పారు.. అలానే విభజన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాల్సిందే అంటూ పట్టు పట్టారు.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినందున.. భూసేకరణ, పునరావాసం, నిర్మాణ ఖర్చులన్నీ కేంద్రమే భరించాలని.. అలానే ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం తిరిగి చెల్లించాలంటూ స్పష్టం చేసారు.

అమరావతి నిర్మాణానికి 20 ఏళ్లలో 5 లక్షల కోట్లు అవసరమని, కానీ కేంద్రం ఇప్పటివరకు కేవలం 1500 కోట్లతో సరిపెట్టుకుంది అంటూ బాబు ఆవేదన వ్యక్తం చేసారు.. అలానే ఏపీలోని వెనకబడిన జిల్లాలను ఆదుకొనే విషయంలోనూ కేంద్రం వివక్ష చూపిస్తుందని విమర్శించిన బాబు, ఈ ఏడాది వెనకబడిన జిల్లాల కోసం ఖాతాలో జమ చేసిన 350 కోట్లను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తూ బాబు కేంద్రంపై మండిపడ్డారు.. ఏపీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దానికి కేంద్రం కూడా సహకరించాలని కోరారు.. మొత్తానికి మోడీ సాక్షిగా నీతి ఆయోగ్ లో బాబు కేంద్రాన్ని గట్టిగానే అడిగారన్నమాట.