ముగిసిన భేటీ..పొత్తుపై క్లారిటీ..

 

తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో టీటీడీపీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా కూటమిలో పొత్తులు, సీట్ల సర్దుబాటు, పార్టీ టికెట్లు ఆశించేవారిపై కీలకంగా చర్చించారు.అనంతరం రాష్ట్ర  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు ముఖ్యమని.. సీట్ల విషయంలో సర్దుకుపోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని బాబు పేర్కొన్నారు.కాంగ్రెస్‌ 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. మరో 6 సీట్లు అడుగుదామన్నారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడుతానని నేతలకు చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తుంది. మహాకూటమి గెలుపునకు టీడీపీ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. 

తెలంగాణలోని నాయకులకు న్యాయం జరిగేలా ఎల్. రమణ, నామ నాగేశ్వరరావు చూస్తారన్న చంద్రబాబు టికెట్ రాని వారు అసంతృప్తి చెందవద్దన్నారు.మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు.తెలంగాణలో ప్రచారం చేయాలని టీడీపీ నేతలు కోరగా అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో నాలుగు సభలు పెట్టాలని చంద్రబాబును నేతలు కోరినట్లు సమాచారం.ఇదిలా ఉంటే భేటీలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.కూకట్‌పల్లి స్థానాన్ని పెద్దిరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శెరిలింగంపల్లి స్థానంపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. భవ్య సిమెంట్స్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.