అమరావతి దెయ్యాల పట్టణంగా మారుతోందా? ఇంటర్నేషనల్ మీడియా ఏమంటోంది?

 

అమరావతి... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని... హైదరాబాద్ ను తలదన్నేలా, వరల్డ్ టాప్-5 సిటీస్ లో ఒక్కటిగా, ప్రపంచస్థాయి మహాపట్టణం నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేశారు. రైతులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్ర విభజనతో కోల్పోయిన హైదరాబాద్ ను మించిన ప్రపంచశ్రేణి పట్టణం నిర్మాణం కావాలని ఆంధ్రులు ఆకాంక్షించారు. అయితే, అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... తన తెలివి తేటలతో వరల్డ్ క్లాస్ డిజైన్స్ తో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు. పునాదులు సైతం పడ్డాయి. అంతలోనే ఎన్నికలు రావడం, టీడీపీ పరాజయం పాలవడంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, అమరావతి నిర్మాణానికి గండిపడింది. పనులు ఆగిపోయాయి, కార్మికులు వెళ్లిపోయారు. యంత్ర సామగ్రి తరలిపోయింది. దాంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అమరావతిపై సీత కన్నేసిన జగన్ ప్రభుత్వం... తొలి బడ్జెట్ లో కేవలం ఐదొందల కోట్లిచ్చి చేతులు దులుపుకుంది. అదేసమయంలో అమరావతికి భారీ రుణం ఇస్తామన్న వరల్డ్ బ్యాంకు వెనక్కివెళ్లిపోయింది. అలాగే మరో ఇంటర్నేషనల్ బ్యాంకైన ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్‌ సైతం అమరావతి నుంచి పక్కకు తప్పుకుంది... దాంతో అమరావతికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ రెండు బ్యాంకులు వైదొలగడానికి టీడీపీ ప్రభుత్వ అవినీతే కారణమని జగన్ సర్కారు ఆరోపిస్తున్నా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి రాజకీయ, ఆర్ధిక మద్దతు దొరకడం లేదనేది వాస్తవం. పైగా రాజధాని భూములపై జగన్ విచారణకు ఆదేశించడం కూడా అమరావతికి అవరోధంగా మారిందనే మాట వినిపిస్తోంది.

ఏదేమైనా, అమరావతిపై జగన్ ప్రభుత్వానికి అనురాగం లేదని, అందుకే పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నా చూసీచూడనట్లు వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు మేజర్ బ్యాంకులు తప్పుకోవడం, రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకోవడంతో... భూములిచ్చిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి భవిష్యత్ అంధకారంలో పడిందని, తమ త్యాగం వృథా అవుతోందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వరల్డ్ క్లాస్ సిటీ లెవల్ నుంచి... దెయ్యాలు తిరిగే పట్టణంగా అమరావతి రూపాంతరం చెందుతుందంటూ ఇంటర్నేషనల్ మీడియా అంచనా వేస్తోంది.