అమ‌రావ‌తి శంకుస్థాపన జరిగి నేటికి మూడేళ్లు

 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు మహానగరం హైదరాబాద్ రాజధానిగా ఉంది. మరి ఏపీ పరిస్థితి ఏంటి అంటూ ఏపీ ప్రజలు ఆందోళన చెందారు. అందుకే 2014 ఎన్నికల్లో అనుభవం, ముందుచూపు ఉన్న చంద్రబాబుకు పట్టం కట్టారు. చంద్రబాబు కూడా ఏపీని, ఏపీ రాజధానిని ప్రపంచస్థాయిలో నిలబెట్టాలని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసారు. ప్రపంచస్థాయి నిపుణులతో అమరావతి డిజైన్స్ వేయించి.. ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ గొప్ప రాజధాని దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అడుగులు మొదలై మూడేళ్లు పూర్తయింది. 2015 అక్టోబర్‌ 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన ఎంత ఘనంగా జరిగిందో రాజధాని కూడా అంతే ఘనంగా ఉండేలా నిర్మాణం జరుగుతుంది. రాజధాని నిర్మాణాన్ని చేపట్టిన ఏపీ ప్రభుత్వం ఏడు నెలల్లోనే తాత్కాలిక సచివాలయం పూర్తి చేసింది. మౌలిక వసతులు, భవనాల నిర్మాణాలకు రూ.48,116 కోట్లు అంచనా వ్యయం కాగా.. ప్రస్తుతం రూ.14,630 కోట్ల విలువైన పనులు చేపట్టింది. టెండరు దశలో రూ.4వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో 320 కిలోమీటర్ల పొడవైన 34 ప్రధాన రహదారుల నిర్మాణం జరుగుతుంది. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ వనరుల ద్వారా నిధులు సమీకరిస్తోంది.