ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వైఎస్ఆర్ కాపునేస్తం, కడప స్టీల్ ప్లాంట్‌

 

ఏపీ ప్రభుత్వం పథకాల పరంపర కొనసాగిస్తోంది. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కాపులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో జగన్ సర్కార్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కాపు సామాజికవర్గం మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ. 1101 కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు. కుటుంబానికి రూ. 2.5 లక్షల లోపు ఆదాయం ఉండి.. 45 ఏళ్లు దాటిన ప్రతి కాపు మహిళకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేల సాయం అందించనున్నారు. 

కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. నవశకం సర్వే ద్వారా వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. జగనన్న వసతి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపైన చదువుకునే విద్యార్థులకు రూ.20వేల ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇళ్ల పట్టాలపై హక్కు కల్పిస్తూ పేదలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మద్యం ధరల పెంపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరుగుతుందన్నారు.