Y టర్న్ & నాలుగుకాళ్ళ సిద్ధాంతం!

 

AP bifurcation, bifurcation of Andhra Pradesh, telanga state, telangana note, samaikyandhra, chandrababu, ysrcongress, congress

 

 

తెలుగుజాతి మొత్తం క్షేమంగా వుండాలని, తెలంగాణ-సీమాంధ్ర తనకు రెండు కళ్ళలాంటివని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నప్పడు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ‘రెండుకళ్ళ సిద్ధాంతం’ అంటూ వెక్కిరింతగా మాట్లాడాయి. ఎవరు ఎంతగా విమర్శించినా చంద్రబాబు తెలుగుజాతి మొత్తం బాగుండాలి. రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చినా సమన్యాయం పాటించాలని చెబుతూ వచ్చారు. అన్నదమ్ములు విడిపోతే ఎవరూ నష్టపోకూడదని అంటూ వచ్చారు. టీడీపీ మాటలకు పెడర్ధాలు తీస్తూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెరైటీ సిద్ధాంతాల్లోకి మళ్ళాయి.

 


కాంగ్రెస్ పార్టీ నాలుగు కాళ్ళ సిద్ధాంతంతో నడుస్తుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయంలో “Y” టర్న్ తీసుకుంది. అదెలాగంటే, నిన్నగాక మొన్న జరిగిన కేంద్ర మంత్రుల బృందం సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జీఓఎం ముందు నాలుగు కాళ్ళ సిద్ధాంతం ప్రదర్శించింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించాలని అంటే, మరికొంతమంది రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందేనన్నారు. ఇంకొందరు కాంగ్రెస్ నాయకులు రాయల తెలంగాణ అంటే, ఇంకొంతమంది మాత్రం విభజనకు ఒప్పుకోం.. ఒకవేళ విభజిస్తే మా ప్రాంతానికి న్యాయం చేయండంటూ వెరైటీ ప్రపోజల్ పెట్టారు.




మొత్తానికి ఒకే విషయం మీద నాలుగు రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీది నాలుగు కాళ్ళ సిద్ధాంతం కాక మరేమవుతుంది? ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న “Y” టర్న్ దగ్గరికొస్తే, మొదట విభజనవాదాన్ని భుజాన వేసుకుని ఆ మార్గంలో ప్రయాణించిన ఆ పార్టీ ఇప్పుడు పైకి సమైక్యం అంటూ, లోపల విభజన మంత్రం జపిస్తూ రెండు దారుల “Y” జంక్షన్‌లో నిలబడి వుంది. ఇలాంటి విధానాలతో ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదని తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు.