ఏపీ అసెంబ్లీ... ప్రతిపక్షం కూడా అధికార పార్టీ నేతలే...

 

ఒకపక్క ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు జరుపుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. తాజాగా కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదన్నా లోటును అధికార పార్టీ నేతలే తీర్చేస్తున్నారు. ప్రతిపక్షం పార్టీ పాత్రను అధికార పక్షమే పోషిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా మంత్రులను నిలదీయడం, దానికి మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడం విస్తు గొలుపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి అచ్చెన్నాయుడును నిలదీశారు... తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని, అలా అయితే ఇక జీరో అవర్ ఎందుకని, దానిని తీసేయాలని సభలో గోరంట్ల ఊగిపోయారు.ఆయన వాదనకు బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మద్దతు పలికారు. ఇక ఇదిలా ఉండగా.. దూళిపాళ్ల నరేంద్ర కూడా పర్యాటక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ బోటు ప్రమాదంపై మాట్లాడుతూ.. ఇందులో అధికారుల తప్పిదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యేలు నిలదీస్తున్నా చంద్రబాబు ఏం అనట్లేదా అని డౌట్ రావచ్చు. దీనంతటికీ కారణం చంద్రబాబేనట. సభలో ప్రతిపక్షం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఎమ్మెల్యేలు ప్రతిపక్షంగా వ్యవహరించాలని సమస్యలపై మంత్రులను నిలదీయాలని పూర్తి స్వేచ్ఛను ఇచ్చారట. దీంతో ఎమ్మెల్యేలో ప్రతిపక్షపార్టీ పాత్ర పోషిస్తూ.. మంత్రులను నిలదీస్తున్నారు.

 

మొత్తానికి చంద్రబాబు రాజకీయానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఒకపక్క పాదయాత్ర అంటూ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు డుమ్మా కొడితే... చంద్రబాబు మాత్రం వారు లేకపోయినా అసెంబ్లీ జరిపించగలం అని నిరూపించారు. ఇప్పుడు తాజాగా ప్రతిపక్షం కూడా అవసరం లేదు అన్నట్టు... ప్రతిపక్షం పార్టీ పాత్రను కూడా తమ నేతలే పోషించేలా చేశారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కూడా ప్రతిపక్షం లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదేమో అనిపిస్తుంది. ఇది కనుక సక్సెస్ అయితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు అంటూ బయటకు వెళ్లిపోయినా.. అధికార పార్టీలు మాత్రం ఎంచక్కా అసెంబ్లీలు నడిపేయోచ్చేమో. మొత్తానికి చంద్రాబాబుకు రాజకీయం చాణక్యుడు అన్న పేరు ఎందుకొచ్చిందో మరోసారి నిరూపించుకున్నారు.