ప్రతిపక్షం బాధ్యత మరిచింది... అధికారపక్షం ఆవేశపడుతోంది... అసలు ఏపీ అసెంబ్లీకి ఏమైంది?

 

శాసనసభ... ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే పవిత్రమైన ప్రదేశం. భవిష్యత్‌ తరాలకు దిశానిర్దేశం చేసే అత్యున్నత సభ.. వారి జీవితాలను కూడా ప్రభావితం చేయగల సభ అది. అయితే ప్రజాసమస్యలే ప్రధాన అజెండాగా సాగాల్సిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పక్కదారి పడుతోంది. ప్రతిపక్షం తన బాధ్యత మరిస్తే, అధికారపక్షం ఆవేశపడుతోంది. వ్యక్తిగత దూషణలు, సవాళ్లు-ప్రతి సవాళ్లు, ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఏపీ అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. అరుపులు, కేకలతో అసెంబ్లీ పదేపదే వాయిదా పడుతోంది. గత రెండు వారాలుగా ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న సీన్ ఇదే.

 

ప్రశ్నించాల్సిన వారు ఆవేశపడతారు....అధికార పక్షాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నిస్తారు.. కానీ అప్పటికే అధికారపక్షం డిఫెన్స్ గేమ్ మొదలు పెట్టేస్తుంది.. అర్ధంలేని వాదనలు...వాదోపవాదాలు. దాంతో సమస్యలపై చర్చ దారి తప్పుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలవుతున్నా, కనీసం ఒక్కటంటే ఒక్క ప్రజా సమస్యపై సమగ్రమైన చర్చ జరగలేదు. ఇటు ప్రతిపక్షం, అటు అధికారపక్షం... ఇద్దరూ ఒకరినొకరు తప్పుపట్టుకోవడానికే సమయమంతా సరిపోతోంది. ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నట్లే, తప్పు జరిగితే హుందాగా ఒప్పుకునేందుకు అధికారపక్షం కూడా సిద్ధంగా ఉండాలి. కానీ ఏపీ అసెంబ్లీలో దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇస్తూ, వాటిపైనే సుదీర్ఘమైన చర్చలు జరుపుతూ, ప్రజాసమస్యల్ని గాలికొదిలేస్తున్నారు.

 

సహజంగా ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ లోపాలు వెదికి విమర్శించే ప్రతిపక్షం.... గవర్నర్‌ ప్రసంగంలో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందంటూ ఆరోపణలు చేసింది. అలా మొదలైన రగడ, మీడియా పాయింట్‌ దగ్గర టీడీపీ-వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తోపులాటకు దిగడంతో తారాస్థాయికి చేరింది. ఈలోగా మహిళలేనా, మేం కూడా అంటూ మగ ఎమ్మెల్యేలూ పోటీ పడ్డారు. మీడియా పాయింట్‌ దగ్గర రచ్చ రచ్చ చేశారు. టీవీల్లో చూసేవాళ్లకి అసలు వీళ్లు ఎమ్మెల్యేలేనా అనే సందేహం కలిగించారు.

 

మహిళలపై అత్యాచారాలు, రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పవర్‌ ప్రాజెక్టుల్లో అవినీతి, అగ్రిగోల్డ్ ఇలా కొన్ని ఇష్యూలను ప్రతిపక్షం ప్రస్తావించినా, చర్చ మాత్రం జరగలేదు. వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడం, వైసీపీ ఆందోళనలకు దిగడం పరిపాటిగా మారిపోయింది. ఒకట్రెండు అంశాలపై చర్చకు అనుమతించినా, అది చివరికి వ్యక్తిగత దూషణలకి దారి తీస్తోంది. పవర్‌ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని జగన్‌ అంటే, ఈడీ ఆస్తుల జప్తుపై ముందు వివరణ ఇవ్వాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఎదురుదాడికి దిగడంతో సభలో రచ్చరచ్చ జరిగింది.

 

అయితే కొంత సంయమనం పాటిస్తూ, ప్రజాసమస్యలపై చర్చ జరిగేటట్లు చూడాల్సిన బాధ్యత అధికారపక్షంపై ఉన్నా, ప్రతిపక్షాన్ని మరింత రెచ్చగొడుతూ ఎదురుదాడికి దిగుతుండటంతో చర్చ పక్కదారిపడుతోంది.