మీరాకుమార్ ఏపీకి ఎందుకు రాలేదు..?

    

రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయి. రామ్ నాథ్ కోవింద్, మీరా కుమార్ పోటీపడుతున్నారు. మరి గెలుపెవరిది? ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సమీకరణలు తెలిసిన ఎవ్వరైనా ఠక్కున సమాధానం చెప్పగలరు! బీజేపి మద్దతుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన రామ్ నాథ్ దే విజయం! ఇది నూరు శాతం తథ్యం. అయినా కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ , దానికి తోడైన సెక్యులర్ కమ్యూనిస్టులు మాజీ స్పీకర్ మీరా కుమార్ ని రంగంలోకి దింపారు! ఆమె పోరాడుతోన్న ఎన్నికల యుద్ధం… ఓడిపోవటానికి చేస్తోన్నదే!

 

బాబు జగ్జీవన్ రామ్ కూతురైన మీరా కుమార్ ను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా బరిలోకి దింపి ఏం సాధించదలుచుకుందో ఆ పార్టీకే తెలియాలి. ఓటమి తప్పనిసరే కాదు… ఓట్ల విషయంలో చాలా తేడా వుండేలా కనిపిస్తోంది పరిస్థితి. బీజేపికి లోక్ సభలో 282సీట్ల దాకా వుంటే కాంగ్రెస్ కు కేవలం 44 మాత్రమే వున్నాయి. యూపీ ఎన్నికల తరువాత రాజ్యసభలోనూ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు, కమ్యూనిస్టుల పరిస్థితి అంతంతమాత్రంగానే వుంది. పైగా నితీష్ లాంటి నేతలు కూడా హస్తం పార్టీకి హ్యాండిచ్చి బీజేపి వైపు చేరిపోయారు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ విషయంలో! మొత్తం మీద కాంగ్రెస్ మీరా కుమార్ ను రామ్ నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలిపి ఉనికిని చాటుకుందామని భావించింది. కాని, జరగబోయేది చూస్తుంటే… కాంగ్రెస్ బలహీనత, దయనీయత ఈ ఎన్నికల సందర్బంగా మరింత స్పష్టమయ్యేలా వుంది!

 

తమకు ఎవరు ఓటు వేస్తారు, ఎవరు వేయరు అని ముందే తెలిసిపోయినా… రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు ప్రతీ రాష్ట్రమూ, కేంద్రపాలిత ప్రాంతమూ తిరిగి అక్కడి ప్రజాప్రతినిధుల్ని మద్దతు కోరటం పరిపాటి. ఆ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు చుట్టేస్తున్న మీరా కుమార్ కాలుమోపని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశట! ఎందుకో తెలుసా? అసలు మన ఏపీలో కాంగ్రెస్ కి ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా లేరు! ఇలాంటి దుస్థితి తమిళనాడు మొదలు మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ వరకూ ఎక్కడా లేదు! అందుకే, దేశమంతా తిరుగుతోన్న మీరా కుమార్ తెలంగాణకు వచ్చి మరో తెలుగు రాష్ట్రం వైపు చూడకుండానే వెళ్లిపోయారు!

 

ఏపి నుంచీ ఓట్లు పడినా , పడకున్నా మీరా కుమార్ గెలిచే అవకాశాలు లేవని కాలిక్యులేషన్స్ చెప్పేస్తున్నాయి. కాని, సోనియా, రాహుల్ గాంధీలు ఇప్పుడైనా ఒక్కసారి తమ రాంగ్ స్టెప్స్ ని వెను తిరిగి చూసుకోవాలి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పక్కన పెడితే అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనానికి ఏపీ వ్యవహారం చక్కటి ఉదాహరణ! యూపీ పాలన కాలంలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ మంది ఎంపీల్ని అందించింది సమైక్యాంధ్రప్రదేశే! అటువంటి ఏపీని జగన్ ఇష్యుతో, ప్రత్యేక తెలంగాణ వివాదంతో చేయి పార్టీ చేజేతులా చేజార్చుకుంది! తెలంగాణ ఇచ్చీ ఒక రాష్ట్రంలో ఓడింది, ఇవ్వక మరో రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయింది. తాజాగా ఆ పార్టీ నుంచి ఏపీ రాజధాని ప్రాంతం కీలక నేతైన మల్లాది విష్ణు జగన్ పంచన చేరటం… కాంగ్రెస్ కౌంట్ డౌన్ కి మరో నిదర్శనం! ఆ మధ్య వచ్చి బహిరంగ సభ పెట్టి ప్రత్యేక హోదా అన్న రాహుల్ మళ్లీ ఇటువైపు ఎప్పుడు ప్రత్యేక దృష్టి పెడతారో తెలియదు! కాబట్టి… మోదీ చెప్పిన కాంగ్రెస్ ముక్త్ భారత్ లో మొట్ట మొదటి పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశే అయేట్లుగా వుంది!