అంతరిక్షంలో శరీరం ఏమవుతుంది?

 

ఇస్రో పుణ్యమా అని ఇప్పుడంతా అంతరిక్షం గురించే మాట్లాడుతున్నారు. మరికొన్నాళ్లకి భారతీయులు అంతరిక్షంలోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదంటూ సంబరపడుతున్నారు. ఇంతకీ భూమ్యాకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా...

 

కండరాలు – ఎముకలు

 

భూమి మీద ఉన్న ఆకర్షణశక్తిని (గ్రావిటీ) తట్టుకుంటూ నడవడం వల్ల మన కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. కానీ జీరో గ్రావిటీ వద్ద ఇలాంటి ఒత్తిడి ఏమీ ఉండదు. దాంతో ఎముకలు, కండరాలకి ఎలాంటి పనీ ఉండదు. ఫలితంగా ఎముకలు దృఢత్వం తగ్గుతుంది. కండరాలు కూడా మెత్తబడిపోతాయి. దీనికల్లా ఒకే ఉపాయం! స్పేష్ షటిల్లో వీలైనంత వ్యాయామం చేస్తూ ఉండాల్సిందే!

 

కళ్లు

 

శరీరంలో ఎక్కువ శాతం నీరే  ఉంటుందన్న విషయం తెలిసిందే కదా! నేల మీద ఉన్నప్పుడు శరీరంలోని రసాయనాలన్నీ భూమ్యాకర్షణ శక్తి వల్ల కిందకి ప్రవహిస్తాయి. కానీ అంతరిక్షంలో అలా కాదు... ఒంట్లోని రసాయనాలన్నీ సమంగా వ్యాపిస్తాయి. ఫలితంగా కంటి చుట్టూ కూడా కొంత తడి చేరుతుంది. దీని వల్ల కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అంతేకాదు... అలా కంటి లోపల ఒత్తిడి ఏర్పడటం వల్ల ఒకోసారి కంటిచూపు కూడా మందగించే ప్రమాదం ఉంది.

 

వెన్నెముక

 

అంతరిక్షంలో ఉన్నప్పుడు మనిషి ఎత్తు ఓ మూడు శాతం పెరుగుతుంది. అంటే ఆరడుగుల ఎత్తున్న మనిషి ఏకంగా మరో రెండు అంగుళాలు పెరుగుతాడన్నమాట. వెన్నెముక మీద భారం తగ్గడం వల్ల, అందులోని డిస్కులు కాస్త వెడం కావడమే దీనికి కారణం. అయితే భూమి మీదకు వచ్చిన కొద్ది నెలలకే తిరిగి వెన్ను సాధారణ స్థితికి చేరుకుంటుంది.

 

మానసిక స్థితి

 

అసలే రోజుల తరబడి భూమికి దూరంగా ప్రయాణం... అక్కడ అంతరిక్షంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఉత్కంఠత. ఆపై రోజూ గంటల తరబడి అవే మొహాలు. అన్నింటికీ మించి సరిగా నిద్ర ఉండదు. బయట నుంచి మిరుమిట్లు గొలిపే కిరణాల ప్రభావంతోనూ, భూమ్యాకర్షణ లేక గాలిలోనే పడుకోవాల్సి రావడంతోనూ... కంటి మీద కునుకు ఉండని పరిస్థితి. ఇవన్నీ కూడా వ్యోమగాములకు ఓ సవాలుగా నిలుస్తాయి.

 

రేడియేషన్

 

భూమి మీద మనుషులు హాయిగా మనుగడ సాగించడానికి కారణం... సూర్యుడో, నీరో కాదు – ఓజోను పొర. ఆ పొర మనల్ని అతినీలలోహిత (UV) కిరణాల నుంచి రక్షిస్తుంది. కానీ అంతరిక్షంలో ఇలాంటి రక్షణలేవీ ఉండవు. వ్యోమగాముల శరీరం మీద ఉండే దుస్తులే వారిని కాపాడాలి. అంతేకాదు! అంతరిక్షంలో ఉన్నప్పుడు కేవలం సూర్యుడి నుంచే కాకుండా విశ్వంలోని ప్రతి మూల నుంచీ కూడా రేడియేషన్ కిరణాలు వారి మీద దాడి చేస్తుంటాయి. అందుకనే వ్యోమగాముల దస్తులకు రేడియేషన్ తాకిడిని కొలిచే ఓ పరికరాన్ని ఉంచుతారు. వారు ఒక స్థాయికి మించిన రేడియేషన్కు లోనయ్యారని తెలిస్తే ఇక వారిని భవిష్యత్తులో అంతరిక్షంలో పంపరు.

 

అదీ సంగతి! అంతరిక్షంలోకి తేలిపోవాలనుకునేవారి శరీరంలో ఇలాంటి మార్పులెన్నో కనిపిస్తాయి. అయినా మానవాళ కోసం, విజ్ఞానం అభివృద్ధి చెందడం కోసం ప్రమాదాలకు తెగించి వారు ప్రయోగాలకు సిద్ధపడుతూ ఉంటారు.

- నిర్జర.