చీమలు నేర్పే జీవితపాఠాలు

గ్రహించే మనసు ఉండాలే కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అణువణువూ ఓ జీవితపాఠాన్ని నేర్పుతుందంటారు పెద్దలు. ఇందుకు చీమలనే ఓ ఉదాహరణగా తీసుకోవచ్చునేమో. విశ్లేషించడం అంటూ మొదలుపెడితే, చీమల నుంచి ఎన్నో విలువైన పాఠాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని...

 

పూర్తిస్థాయి సామర్థ్యం:

తాము అల్పంగా ఉన్నాం కదా అని చీమలు వెనకడుగు వేయవు. ఎంతబరువు మోయగలవో అంత బరువునీ మోసేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకేనే చీమలు తమ బరువుకంటే దాదాపు 5000 రెట్లు అధికబరువుని మోయగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకుంటాయని తాజా పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. కానీ మనుషులు అలా కాదు! ఎన్నో ఆలోచనలు చేయగల సామర్థ్యం, వాటిని అమలుపరిచే సత్తా ఉన్నా లేనిపోని పరిమితులను ఊహించుకుని గిరగీసుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటివారికి చీమలు ఓ గొప్ప గుణపాఠం కదా!

 

వెనకడుగు వేసేది లేదు:

ఆహారం కోసం బారులుగా బయల్దేరిన చీమలకి దారిలో ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి... అవి వెనక్కి వెళ్లడం జరగదు. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం ఏముంటుందా అని అన్వేషిస్తాయి. అటుతిరిగీ ఇటుతిరిగీ ఎలాగొలా గమ్యానికి చేరుకుంటాయి. ఒకటి రెండు అడ్డంకులకు బెంబేలెత్తిపోయి చేతులెత్తేసే మనకి ఇలా నిరంతరం లక్ష్యం వైపుగా సాగిపోవడమే ధ్యాసగా ఉన్న చీమలు గొప్ప స్ఫూర్తి కదా!

 

కలసికట్టుగా:

బలవంతమైన సర్పము/ చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! అంటాడు శతకకారుడు. చీమలు గొప్ప సంఘజీవులు అన్న విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. అవి తాము సేకరించిన ఆహారాన్ని మిగతా చీమలన్నింటితోనూ పంచుకునేందుకే ఇష్టపడతాయి. ప్రతి చీమా తనకు ఎదురుపడిన చీమతో దారుల గురించీ, ఆహారం గురించీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని తేలింది. తన ఆకలి తీరడమే కాదు, తన తోటివారి కడుపు నిండినప్పుడే నిజమైన తృప్తి లభిస్తుందని చీమలు బోధిస్తున్నాయి.

 

దూరదృష్టి:

చీమల దూరదృష్టి గురించి బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే అవి పుట్టలను నిర్మించుకుంటాయనీ, ఆహారాన్ని పోగేసుకుంటాయని అంటారు. వీటిలో ఎంతవరకు నిజం ఉందో కానీ దీర్ఘకాలం తిండికీ గూడుకీ ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా అవి తగిన ఏర్పాట్లు చేసుకుంటాయనే విషయంలో ఏ అనుమానమూ లేదు. ఒంట్లో సత్తువ ఉండగా శ్రమించడమే కాదు, అది లేని రోజు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆలోచనని చీమలు కలిగిస్తున్నాయి.

 

లక్ష్యం ఉంటుంది:

చీమల్ని చూస్తే అవి నిరంతరం ఏదో వెతుకులాటలో ఉన్నట్లే కనిపిస్తాయి. ఆహారాన్ని వెతుక్కొంటూనో, దొరికిన ఆహారాన్ని మోసుకువెళ్తూనో, సాటి చీమలతో సమాచారాన్ని పంచుకుంటూనో వడివడిగా సాగుతుంటాయి. మనసుకి ఆలోచించే దమ్ము, ఒంట్లో పనిచేసే సత్తా ఉన్నంతవరకూ విశ్రమించవద్దంటూ మనకి సూచిస్తూ ఉంటాయి.

 

- నిర్జర.