అన్నార్తుల ఆక‌లి తీరుస్తున్న అన్న‌పూర్ణ భోజ‌నం!

మ‌ధ్యాహ్నం 45వేల మందికి, రాత్రిపూట 15వేల మందికి అన్న‌పూర్ణ ఉచిత భోజ‌నాన్ని జిహెచ్‌ఎంసి అందిస్తోంది. ఆరు సంవ‌త్స‌రాల క్రితం జిహెచ్‌ఎంసి ద్వారా 8 కేంద్రాల‌తో ప్రారంభ‌మైన అన్న‌పూర్ణ భోజ‌న ప‌థ‌కం నేడు 150 కేంద్రాల‌కు విస్త‌రించింది. ప్ర‌ధాన‌మైన ఆసుప‌త్రులు, బ‌స్టాండ్‌లు, రైల్వే స్టేష‌న్లు, కూలీల అడ్డాలు, విద్యాసంస్థ‌లు, కోచింగ్ సెంట‌ర్లు ఉన్న ప్ర‌దేశాల్లో న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల‌లో అన్న‌పూర్ణ కేంద్రాలు న‌డుస్తున్నాయి. ప్ర‌తి భోజ‌నంలో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల ప‌ప్పు, సాంబార్‌, ప‌చ్చ‌డి త‌ప్ప‌నిస‌రిగా ఉండేవిధంగా మెనును అమ‌లు చేస్తున్నారు.  

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టుట‌కు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ర‌వాణా వ్య‌వ‌స్థ నిలిచిపోయింది. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు అక్క‌డే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ‌ర్త‌క వ్యాపార సంస్థ‌లు, విద్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు మూసివేయ‌డంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. నిర్మాణ ప‌నులు ఆగిపోయాయి. దీంతో ఇబ్బంది ప‌డుతున్న వ‌ల‌స కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్ర‌యులు, వ‌స‌తి గృహాల‌లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగుల‌ను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. అటువంటివారంద‌రీ ఆక‌లి తీర్చేందుకు రూ. 5/-ల‌కే పెడుతున్ అన్న‌పూర్ణ భోజ‌నాన్ని పూర్తిగా ప్ర‌భుత్వం ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తుంది. 

లాక్‌డౌన్ నేప‌థ్యంలో వ‌స‌తి గృహాలు, షెల్ట‌ర్ హోమ్స్‌, అక్క‌డ‌క్క‌డ హోట‌ల్స్, రెస్టారెంట్ల‌లో చిక్కుకుపోయిన‌వారికి కూడా అన్న‌పూర్ణ భోజ‌నాన్ని అందిస్తున్నారు. ఏ ఒక్క‌రు ఆక‌లితో ఉండ‌రాద‌నే ఉద్దేశంతో ప్ర‌జాప్ర‌తినిధులు, జిహెచ్‌ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు కోరిన విధంగా ఫంక్ష‌న్‌హాళ్లు, క‌మ్యునిటీహాల్స్‌, దేవాల‌యాల ప్రాంగ‌ణాలు, స్టేడియంలు ఇత‌ర ప్ర‌దేశాల్లో ఆశ్ర‌యం క‌ల్పించి వారికి కూడా అన్న‌పూర్ణ కేంద్రాల ద్వారా ఉచితంగా భోజ‌నాన్ని అందిస్తున్నారు.