అన్నాజీ ప్రజలను తప్పుపట్టనేల?

 

దేశంలో అవినీతిని అంతం చేసేందుకు కంకణం కట్టుకొని తిరుగుతున్న సామాజిక ఉద్యమకారుడు అన్నహజారే నిన్న హైదరాబాదులో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, దేశం నుండి అవినీతిని తరిమికొట్టేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 120 కోట్ల మంది భారతీయులలో తానూ కనీసం 6కోట్ల మందిని ప్రభావితం చేయగలిగినా తన ఉద్యమ లక్ష్యం సాదించగలనని అన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఆమోదించిన లోక్ పాల్ బిల్లుతో కేవలం 50 శాతం అవినీతిని మాత్రమే రూపుమాపగలమని, మిగిలిన దానిని అంతం చేయడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

అన్నాహజారే అవినీతి వ్యతిరేఖంగా చేపట్టిన ఈ ఉద్యమంలో దేశాన్ని ప్రేమిస్తున్నామనుకొన్న ప్రతీ భారతీయుడు పాలుపంచుకోవలసిందే. లేదంటే ఏదో ఒకనాడు అవినీతి దేశాన్నేకబళించి వేయడం ఖాయం.

 

అయితే, ప్రజలను చైతన్యపరచి, దీక్షలుచేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ప్రతీసారీ సాద్యం కాకపోవచ్చును. రెక్కాడితే గాని డొక్కాడని మధ్యతరగతి ప్రజలు ఆయన పిలుపందుకొన్న ప్రతీసారీ వచ్చి రోజుల తరబడి ఉద్యమాలు చేయలేరు. అందువల్ల తన పిలుపుకు ప్రజలు తగినరీతిగా స్పందించడం లేదనే ఆయన ఆవేదన అర్ధరహితం.

 

గనుక, దీనికి సరయిన ప్రత్యామ్నాయ పరిష్కారం ఏమిటంటే అన్నాహజారే కూడా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడమే. తనవంటి నిజాయితీ పరులయిన వ్యక్తులతో ప్రభుత్వం ఏర్పరచగలిగినప్పుడే, ఆయన ఆలోచనలను, ఆశయాలను అమలు చేయడం వీలవుతుంది తప్ప కేవలం నిరాహార దీక్షలు, సభలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని దానిలోని అవినీతిని నియంత్రించడం సాద్యం కాదని ఆయన గ్రహించవలసిఉంది. లేకుంటే, ఆయన పోరాటం కూడా, సమాజంలో మార్పు తేవాలని దశాబ్దాల తరబడి సాయుధ పోరాటం చేస్తున్న నక్సల్స్ పోరాటాల మాదిరిగానే వ్యర్ధమయిపోతుంది.

 

బహుశః ఈ ఆలోచనతోనే అయన సహచరుడు అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని స్థాపించి రాజకీయ ప్రవేశం చేసారు. అయితే, ఆయన గురించి అందరికంటే బాగా ఎరిగిన అన్నాహజారే ఆయన అభిప్రాయంతో ఏకీభవించకపోగా, ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళదలచిన ఆయనను విమర్శించడం ద్వారా, ‘అవినీతిపై పోరాటం’ అనే అంశంపై కేవలం తన పోరాటం ద్వారానే సాద్యం అని ఆయన భావిస్తున్నట్లుంది.

 

దేశానికి స్వాతంత్రం సాదించడానికి మహాత్ముడు ఒక పంధా ఎన్నుకొంటే, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్ వంటివారు మరో పంధాను ఎన్నుకొన్నారు. గానీ, వారి అందరి అంతిమ లక్ష్యం దేశానికి స్వాతంత్రం సాదించడమేనని మన అందరికీ తెలుసు. ఆనాటి పరిస్థితుల్లో అది సమర్ధనీయమే. కానీ, మారిన నేటి పరిస్థితుల్లో దేశం అంతా ఒక్కతాటిపై ఉన్నపుడు కూడా ఒక గొప్ప లక్ష్యాన్ని సాదించడానికి ఆత్మాభిమానాలు అడ్డురావడం గర్హనీయం.

 

యువతను తనతో చేయి కలపమని అన్నాహజారే కోరే బదులు, వారితో ఆయనే చేతులు కలిపి వారినొక సమిష్టిశక్తిగా తీర్చిదిద్దేందుకు తగిన మార్గదర్శనం చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చును.