అనిల్ అంబానీకి సుప్రీం షాక్.. 453 కోట్లు కట్టకపోతే జైలు శిక్షే!!

 

రిలయన్స్ గ్రూప్ సంస్థ ఛైర్మెన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎరిక్సన్ సంస్థకు రూ.453 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులను చెల్లించకపోతే మూడు నెలలు జైలు శిక్షను అనుభవించాలని స్పష్టం చేసింది. రిలయన్స్ గ్రూప్, ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలను గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన వెలువరించింది. అంతేకాదు ఈ మొత్తాన్ని ఆలస్యంగా చెల్లిస్తే 12 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని కూడ సుప్రీం ఆదేశించింది. అయినా రిలయన్స్ గ్రూప్ చెల్లించలేదు. దీంతో ఎరిక్సన్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీం అంబానీకి షాకిచ్చింది. నాలుగు వారాల్లో రూ.453 కోట్ల బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని.. లేనిపక్షంలో 3 నెలలు జైలు శిక్షను అనుభవించాలని స్పష్టం చేసింది. అలాగే అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకుగాను రూ. కోటి రూపాయాలను చెల్లించాలని ఆదేశించింది. రిలయన్స్ సంస్థకు సంబంధించిన మరో ఇద్దరు డైరెక్టర్లకు కూడా చెరో రూ.కోటి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో రిలయన్స్‌కు సంబంధించిన షేర్లు భారీగా పతనమయ్యాయి.