మోడీ మీద అవిశ్వాసం నిలబడుతుందా..?

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏమాత్రం రాజీపడేది లేదని.. అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తానంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తెలిసి అన్నాడో.. తెలియక అన్నాడో తెలియదు గానీ.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతానని.. తాను ఆ పనిచేస్తే టీడీపీ సహకరించాలని.? లేదంటే చంద్రబాబు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే .. తాను ఆయన వెంట నడుస్తానంటూ సవాల్ విసిరి రాజకీయాలను వేడెక్కించాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి.. దీనికి అదనంగా ఎన్డీఏ మిత్రపక్షాలతో బలంగా ఉన్న నరేంద్రమోడీపై అవిశ్వాసం పెడితే.. అది ఎంత వరకు నిలబడుతుందనేదే ఇక్కడ క్వశ్చన్.

 

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం సభ్యుల్లో 10 శాతం మెంబర్ల సపోర్ట్ కావాలి.. అందుకు జగన్‌ బలం సరిపోదు.. ఇక చంద్రబాబు మద్ధతిస్తారా..? లేదా అన్నది పక్కనబెడితే.. సపోర్ట్ చేశారనే అనుకుందాం.. అయినా తీర్మానం సాధ్యం కాదు.. మోడీ అంటే మండిపడుతున్న శివసేన, తృణమూల్ కాంగ్రెస్, అకాలీదళ్, వామపక్షాలు అందరినీ కలుపుకుంటే కానీ స్పీకర్‌కు నోటీసు ఇవ్వడం వరకు వెళుతుంది. దీనిని స్పీకర్ అంగీకరించి సభలో చర్చ చేపట్టి ఓటింగ్ చేపట్టిన పక్షంలో.. మోడీ మీద పీకలదాకా ఉన్న ఆగ్రహం బయటపడుతుందే కానీ... ప్రభుత్వం పడిపోయేంత సీన్ లేదన్నది విశ్లేషకుల మాట. జగన్ సవాల్‌కు చంద్రబాబు స్పందిస్తారనుకుంటే.. ఆశ్చర్చకరంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రీయాక్ట్ అయ్యారు.

 

రాష్ట్ర విభజనతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ భూస్థాపితమైంది. ఇప్పటి వరకు కనీసం సోదిలో కూడా లేదు..  అయితే, ఈ స్థితి నుంచి బయటపడేందుకు కాంగ్రెస్‌కు అద్భుతమైన అవకాశం దొరికింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి కారణం కాంగ్రెసే అని సగటు ఆంధ్రుడు నమ్ముతున్న తరుణంలో.. విభజన సమస్యలపై స్పందించాలని రాహుల్ భావిస్తున్నారు. అందుకే అవిశ్వాసానికి తాము సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు యువనేత.. అయితే ఆ పార్టీకి లోక్‌సభలో తగినంత సంఖ్యాబలం లేదు. కాబట్టి భాగస్వాముల మద్దతును కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఎలాగూ పార్లమెంట్ సమావేశాలు మార్చి 5న ప్రారంభమవుతాయి కాబట్టి.. ఈ లోగా మిత్రులందరితో ఓ మీటింగ్ పెట్టే ఛాన్స్ ఉంది. అయితే రాహుల్ కలిసినా.. అందరూ ఏకమైనా మోడీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నది రాజ్యాంగ నిపుణుల మాట.