జగన్ ఝలక్... ఏపీలో డిసెంబర్ 31వ తేదీ బార్లకు లాస్ట్ డేట్


మందు బాబులకు జగన్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచేసింది. మరోవైపు బార్ల సంఖ్యకు భారీగా కోత విధించింది. డిసెంబర్ నెలాఖరు నాటికి 40 శాతం బార్ లు మూతపడే అవకాశముంది. దీనిపై లైసెన్స్ ఫీజులు కట్టే వ్యాపారాన్ని ప్రారంభించిన సిండికేట్ లు గగ్గోలు పెడుతున్నాయి. ఏపీలో నెల రోజుల వ్యవధి లోనే మద్యం ధరలను రెండవసారి భారీగా పెంచేసింది జగన్ సర్కార్. కొత్త ధరలు, బార్లు, స్టార్ హోటళ్లలో జరిగే మద్యం అమ్మకాలను పరిమితం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. దీంతో మందు బాబులు బార్లకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడ రద్దీ పెరిగిపోయింది. ఇక దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బార్ లకు తాకిడి తగ్గించే పనిలో పడింది. బార్ లలో విక్రయించే మద్యం ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర సమయ పాలన విధించింది. అక్కడ కూర్చుని మందు కొట్టే అవకాశం లేకుండా పోయింది.

బార్ లకు అలవాటు పడిన మందు బాబులకు సర్కార్ నిర్ణయం కరెంటు షాక్ లా తగిలింది. పెరిగిన ధరలను కేవలం బార్లకే పరిమితం చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ధర మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. బార్ లలో మద్యం ధరలు ఒక్క సారిగా పెరగడంతో మందు బాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇక ప్రైవేటు మద్యం షాపులను రద్దు చేసిన నెలల వ్యవధి లోనే ఏపీ ప్రభుత్వం బార్ ల లైసెన్సుల సమీక్షకు సిద్ధమైంది. ఈ ఏడాది జూలైలో సుమారు 37 లక్షల రూపాయలు చెల్లించి లైసెన్సులు పొందిన బార్ నిర్వాహకులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. బార్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేస్తోంది. డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులు రద్దయిపోతాయి. అయితే ఆ తర్వాత కొత్తగా ఎలాంటి విధానం అనుసరిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు స్కూళ్లు, ఆలయాలు, జాతీయ రహదారులకు సమీపంలో వైన్ షాపులు ఉండరాదని నిబంధన ఉంది.

ఇది బార్ లకు పూర్తిస్థాయిలో వర్తింపజేస్తే అధిక సంఖ్యలో మూతపడే అవకాశం ఉంది. గ్రేటర్ విశాఖ నగర పరిధిలో సుమారు 40 బార్ లకు తాళాలు వేసుకోవలసి వస్తోందని నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. మరో 6 నెలలు లైసెన్స్ గడువు ఉండగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు బార్ల యజమానులు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరల కంటే బార్ ల నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు.

దీంతో మందు బాబుల జేబులకు చిల్లు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెంచిన ధరల కంటే క్వార్టర్ పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.80, బీరుపై రూ.20 నుంచి రూ.40 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. నిజానికి బార్ లకు ఆ మేరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. ఎక్సైజ్ అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోవటానికి వీలు లేకుండా పోతోంది.మొత్తం మీద బార్ లలో ధరలను పెంచేసి మందు బాబులకు లైసెన్సుల కోత పెట్టి సిండికేట్ లకు జగన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాల దగ్గర మాత్రం మందు బాబుల కోలాహలం పెరుగుతూనే ఉందంటున్నారు యజమానులు.