జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయం....అభివృద్ధికి చెంప పెట్టు ?

 

భారతదేశంలో మునుపెన్నడూ లేని విధంగా నిన్న ఏపీ అసెంబ్లీ అన్ని ప్రైవేట్ సంస్థలలోని స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం పారిశ్రామిక యూనిట్లు, కర్మాగారాలు, జాయింట్ వెంచర్లు మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో ఉన్న ప్రాజెక్టులలోని అన్ని ప్రైవేట్ సంస్థలలో అవసరం ఉన్న ఉద్యోగులలో 75% ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలి. 

స్థానికంగా అర్హులైన అభ్యర్ధులు అందుబాటులో లేకపోతే మూడేళ్ల లోపు స్థానికులకి అవసరమైన శిక్షణ ఇప్పించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏర్పాటైన అన్ని పరిశ్రమలు/కర్మాగారాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే సంయుక్త ప్రాజెక్టులతోపాటు ఇకపై రాబోయే వాటికీ ఈ చట్టం వర్తిస్తుందట. ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలైతే చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్ల లోపు 75 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలట. 

అలాగే స్థానికుల్లో అర్హులైన వారు లేకపోతే సంబంధిత పరిశ్రమలు చట్టానికి అనుగుణంగా మినహాయింపులు కోరుతూ దరఖాస్తు చేయాలి. అనంతరం ప్రభుత్వం దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. నిజానికి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ల డిమాండ్ ఆంధ్రప్రదేశ్‌  ప్రత్యేకమైనది కాదు. అయినా ముందుకు ముందే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏపీలో ఉన్న ప్రైవేట్ సంస్థల గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది. 

ఇప్పటికే గతంలో కేటాయించిన కాంట్రాక్టుల రద్దు, ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాల విషయంలో పునరుద్ధరణ సహా అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న జగన్ సున్నితమైన ఈ అంశాన్ని ఇంత అనాలోచితంగా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి మన రాష్ట్రంలోనే కాదు గతంలో కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్ లు వచ్చాయి, పెద్ద పెద్ద ఉద్యమాలే జరిగాయి. 

అయినా ఆ రాష్ట్రాలు అభివృద్ధికే పెద్ద పీట వేసి వెనక్కి తగ్గితే ఏపీ సిఎం జగన్ మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం ఎందుకంటే మీకు పని వస్తే ఉద్యోగం ఇస్తామని కంపెనీలు అంటే మీరు ఉద్యోగమిస్తే పని నేర్చుకుంటామనే జోక్స్ చాలా వినే ఉంటాం, ఇది కూడా ఆ కోవకు చెందినదే. నిజానికి ఒక కంపెనీలో 75 శాతం ఉద్యోగం ఇవ్వాలనే రూల్ పెట్టారనుకుందాం, 

అది కూడా కియానే ఉదాహరణగా తీసుకుండాం. ఇక్కడ కార్ల తయారీ స్థానికులకి అప్పచెప్పాలేము కదా, వారి సంస్థలలోని ఉద్యోగులనే తెచ్చి ఇక్కడ పెట్టుకుంది ఆ కంపెనీ, స్థానికులకి ఉద్యోగాలు అంటే సెక్యూరిటీ గానో, హౌస్ కీపింగ్ కో వాడతారు, దాని వలన ఉపయోగం ఏముంటుంది. కియాలో ఉద్యోగం రావాలంటే ఇప్పటిదాకా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేయాలని అనుకునేవారు.

కానీ జగన్ స్థానిక నిర్ణయం వలన వేరే ఇంజినీరింగ్ చదివిన వారికి ఆ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు కదా !. ఈ చట్టం వలన కొత్త కంపెనీల సంగతి పక్కన పెడితే ఇప్పటికే ఉన్న కంపెనీలు కూడా వెనక్కి పోయే అవకాశం ఉంది. ఎవరెన్ని మాట్లాడినా ఇది అనాలోచిత, ఆవేశపూరిత నిర్ణయమనే భావిస్తున్నామని అంటున్నారు విశ్లేషకులు.