కరోనా పట్టని జగన్ సర్కార్- సంక్షోభంలోనూ వరుస జీవోలతో హంగామా..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న పరిస్ధితుల్లో ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణ చర్యలకు ఉపక్రమిస్తుంది. ప్రజలను ప్రాణాంతక వైరస్ బారి నుంచి కాపాడేందుకు తగిన కార్యాచరణ సిద్దం చేసుకుంటుంది. దాన్ని క్షేత్రస్దాయిలో ఎలా అమలు చేయాలా అని నిరంతరం తపిస్తుంటుంది. కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఓవైపు కరోనా వైరస్ పట్టి పీడిస్తున్నా, కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా, రెండు మూడు జిల్లాల్లో కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అనధికారిక నివేదికలు చెబుతున్నా దీనిపై సీరియస్ గా దృష్టిపెడుతున్నట్లు కనిపించడం లేదు.

కరోనా వైరస్ కారణంగా రోజురోజుకీ రాష్ట్రంలో బాధితులు పెరిగిపోతున్నారు. తొలుత విదేశీ ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని అంతా భావించినా, ఆ తర్వాత ఢిల్లీలో మత సమ్మేళనానికి వెళ్లిన వారి కారణంగా అది మరిన్ని రెట్లు ఎక్కువగా విస్తరించింది. ప్రస్తుతం రాష్ఠ్రంలో కరోనా బారిన వారి సంఖ్య అక్షరాలా 143, ఈ సంఖ్య ఎక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్ధితి. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి జగన్ తో పాటు అధికార యంత్రాంగం కూడా కరోనా చర్యలపై తప్ప మరో విషయంపై దృష్టిసారించలేని పరిస్దితి ఉండాలి. కానీ ఏపీలో మాత్రం అలా జరగడం లేదు.

కరోనా వైరస్ నియంత్రణ చర్యల కోసం అధికారులను నియమించిన ప్రభుత్వాధినేత జగన్, ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లు, అధికారులతో రెండు, మూడురోజులుకోసారి సమీక్షలతో కాలం వెళ్ల దీస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్రంలో పలు కీలక రాజకీయ అంశాలపై నిర్ణయాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. దీంతో ఇప్పుడు రాష్టంలో ఏం జరుగుతుదో తెలియక సామాన్యుడు కూడా గందరగోళంలో మునిగిపోవాల్సిన పరిస్దితి నెలకొంది. తాజాగా రాష్ట్ర్ర ప్రభుత్వం అమరావతిలో భూములపై ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ వేయడంతో పాటు తాజాగా ఇళ్ల స్ధలాల కోసం కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసే వరకూ గమనిస్తే ప్రభుత్వానికి కరోనాపై కంటే మిగతా అంశాలపై ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుంది. ఇదే కోవలో నిన్న విశాఖలో గతంలో టీడీపీ అకార్డ్ సంస్ధకు కేటాయించిన 120 ఎకరాల భూముల రద్దు జీవో జారీ వెనుక కూడా ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద ఏంటో తెలుస్తూనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా చర్యలపై సీరియస్ గా దృష్టిపెట్టాలని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కోరుతున్నారు.