వచ్చే ఎన్నికల్లో ఆంధ్రులు ఎవరికి ఓటు వేయాలి?

ఒకవేళ ముందస్తుగానో, లేక సమయానికే అయినా పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఆంధ్రులు ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేస్తారు. అది నిజమే అయినా… తెలంగాణ నుంచీ విడివడీ, హైద్రాబాద్ ను పోగొట్టుకున్న ఏపీ… ఇప్పుడు పీకల్లోతూ ఆర్దిక సవాళ్ల ఉబిలో వుంది. దీన్ని బయటకు లాగటమే ఎవరి లక్ష్యం అయినా. ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, రేపు జగన్ సీఎం అయినా కావచ్చు. కానీ, రాబోయే కొన్ని సంవత్సరాల వరకూ నవ్యాంధ్రకు అనేక అస్థిత్వ సమస్యలున్నాయి. ఎప్పటికప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తే తప్ప నిలదొక్కుకోలేదు. అటువంటి కీలక సమయం కాబట్టే 2014లో జనం అనుభవజ్ఞుడైన చంద్రబాబును తమ సారథిగా ఎంచుకున్నారు.

 

 

త్వరలోనే మరోసారి దేశానికి ఎన్నికలు రావచ్చు. ఎప్పుడో మనం చెప్పలేకున్నా జనం తమ ఎంపీల్ని ఎన్నుకుని దిల్లీకి పంపాల్సి వుంటుంది! మరి టీడీపీ, వైసీపీల్లో ఎవరికి జైకొట్టాలి. ఇతర పార్టీలకి కూడా ఎందుకు మద్దతు తెలుపకూడదు. ఒక్కసారి ఆలోచిద్దాం. బీజేపీ ఇప్పటికే హోదా ఇవ్వక విలన్ గా మారింది. కాబట్టి కమలం గుర్తుకు ఎన్ని ఓట్లు వేసినా, ఎన్ని సీట్లిచ్చినా లాభమే శూన్యమే! మరిక కాంగ్రెస్ కైతే దేశ వ్యాప్తంగా ఏ మాత్రం ఆశావహంగా లేదు పరిస్థితి. పంజాబ్ తప్ప కాంగ్రెస్ చేతిలో ఏ రాష్ట్రామూ లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారీగా ఎంపీలు పెరిగి రాహుల్ ప్రధాని అవుతాడని వారి పార్టీ వాళ్లే నమ్మకంగా చెప్పటం లేదు. అటువంటి పార్టీ… పైగా ఇష్టానుసారం విభజన చేసిన హస్తం… ఇప్పుడు ఎంపీల్ని ఇస్తే ఏం చేస్తుంది? అదృష్టం బాగాలేకపోతే మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది రాహుల్ సేన! కాంగ్రెస్ , బీజేపీలు కాకుండా కమ్యూనిస్టులు, జనసేన వంటి పార్టీలకు ఎంపీల్ని ఇస్తే కూడా ఒదిగేదేం లేదు. ఎందుకంటే,  ఈ పార్టీలు ఇక్కడ అమరావతిలో చక్రం తిప్పలేవు. అక్కడ దిల్లీలో దమ్ము చూపులేవు. ఎటూ బలం లేని పార్టీలకు సీట్లు ఇస్తే సాధించేదేముంది? కాబట్టి చివరాఖరుకు మిగిలేవి టీడీపీ, వైసీపీలే! వీటిలోనే ఆంధ్రా ఓటర్ తన మద్దతు ఎవరికో తేల్చుకోవాలి!

 

 

వైసీపీకి పోయిన ఎన్నికల్లోనూ జనం బాగానే ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ, చేసిందేముంది? మోదీకి లోపాయికారిగా సహకరిస్తూ దిల్లీలో రాజీనామాలు చేసి హైద్రాబాద్ కు వచ్చేశారు. తెలంగాణ రాజధానిలో వ్యాపారాలు, ఏపీ రాజధానిలో చంద్రబాబుపై విమర్శలు. ఇంతే తప్ప ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ… వీటి గురించి వైసీపీ ఎంపీలు మాట్లాడుతున్నారా? మొక్కుబడిగా మాట్లాడినా చివర్లో చంద్రబాబును తిట్టిపోసి మోదీకి సంతోషం కలిగిస్తుంటారు. అంతే తప్ప ఆంద్రా జనం కోసం తపన ఎక్కడా కనిపించదు.

అన్ని పార్టీలు పోనూ మిగిలిన టీడీపీ … ఇప్పుడు పార్లమెంట్లో దేశ మొత్తం ముందు మోదీ సర్కార్ ను ఎండగడుతోంది. అవిశ్వాసం పెట్టి కలకలం రేపింది. ప్రతీ రోజూ చర్చలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పదే పదే మాట్లాడుతోంది. ఇదే ఓటర్లు ఆశించే స్పందన. అది అందిస్తోంది టీడీపీ ఎంపీలేగాని వైసీపీ వారు రాజీనామాలతో సరిపెట్టేశారు. అసెంబ్లీ, పార్లమెంట్లు పక్కన పెట్టి రోడ్ పాలిటిక్స్ చేసుకుంటున్నారు. ఇదే ఏ ఏపీ ఓటరైనా రేపు పోలింగ్  టైంలో ఆలోచించాల్సింది! హోదా వచ్చినా రాకున్నా ఏదో ఒక రోజు తెచ్చేది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎంపీలే. రాబోయే ఎన్నికల్లో మొత్తం పాతిక ఆంధ్రా పార్లమెంట్ స్థానాలు సైకిల్ క్యారియర్ పైకి చేరిపోతే… అప్పుడు వుంటుంది అసలు రాజకీయం. ఇప్పుడు వంద శాతం సీట్లు లేకున్నా ఎంతో పోరాడుతున్న టీడీపీ ఎంపీలు… 25మంది ఒక్కటైతే సభను అల్లాడించగలుగుతారు.

 

 

ఆంద్రా ఓటర్లు వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా చంద్రబాబుకు ఓటు వేస్తేనే హోదా ఉద్యమం ముందుకు పోయేది. లేదంటే, జగన్, పవన్ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ జట్టులోకి చేరిపోయే అవకాశాలే ఎక్కువ. అలాగే, గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా దిల్లీ రాజకీయాలు ఔపోసన పట్టిన చంద్రబాబు ఎంత ఎక్కువ మంది ఎంపీలుంటే అంత ఎక్కువ ప్రభావశీలం అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! మోదీ సర్కార్ వస్తే పోరాటం చేసేందుకు, మరో సర్కార్ వస్తే పొత్తు రాజకీయాల్లో ఏపీకి ఎక్కువ మేలు జరిగేలా చూసేందుకు… అన్నిటికి ఆయనే సమర్థుడు! అందుకే, ఆంధ్రా ఓటర్ చంద్రబాబుకు , టీడీపీకి కాకుండా ఇతర నేతలకి, పార్టీలకి జైకొట్టే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఓటే అత్యంత అమూల్యం….