ఏపీలో ఓటర్ల జాబితా విడుదల.. తన పని తాను చేసుకుపోతున్న ఎస్‌ఈసీ!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు వద్దంటోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేయగా.. జగన్ సర్కార్ హైకోర్టుకు ఆశ్రయించడంతో ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఈ కేసును డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని కోరింది. దీనిపై విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే, ఒకవైపు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా, హైకోర్టులో విచారణ జరగనున్నా.. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఏపీలో ఓటర్ల జాబితాను తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని తెలిపింది. మహిళా ఓటర్లు 2,04,71,506 కాగా.. పురుషులు 1,99,66,737 ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 మంది ఉన్నట్లు తెలిపింది. 2021 జనవరికి కొత్తగా 4,25,860 మంది ఓటర్లు పెరిగారని ఎన్నికల సంఘం పేర్కొంది.