వచ్చే ఎన్నికల్లో తెరాస ఏపీలోనూ పోటీ చేయాలి.!!

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రూ.5కోట్ల వ్యయంతో నిర్మించే మున్సిపల్‌ భవనం, కళాక్షేత్రం భవనాలకు మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే చీకట్లేనని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారని, కానీ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే కరెంటు కోతల్లేకుండా చేశామన్నారు.. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.

 

 

తన ఇంట్లో మనవలు ఏ బియ్యం తింటున్నారో, అదే బియ్యం సాధారణ విద్యార్థులు కూడా తినాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతో వసతిగృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్య అందిస్తున్నామన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కతుందన్నారు.. కాంగ్రెస్‌ పార్టీ 50ఏళ్ల పాటు చేసిన పాపాలు కడిగేందుకు నాలుగేళ్ల సమయం చాలదన్నారు.. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికీ ఆ పార్టీ అడ్డుపడుతోందన్నారు.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పాలమూరుకు నీళ్లందించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. వచ్చే మూడేళ్లలో షాద్‌నగర్‌ను గుర్తుపట్టలేనంతగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు..  ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు.. కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి తమకుంటే బాగుంటుందని పొరుగు రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తెరాస ఏపీలోనూ పోటీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు.