ఆంధ్రోళ్ళకి తెలంగాణలో నో ఎంట్రీ!!

 

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య ఉద్యోగాల విషయంలో నెలకొన్న వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. స్థానికత ఆధారంగానే ఉద్యోగాలు ఉండాలని తెలంగాణ ఇంధన సంస్థలు వాదిస్తుంటే.. అర్హత ఆధారంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ వాదిస్తోంది. తెలంగాణ నుంచి రిలీవ్‌ చేసిన 1,153 మంది ఇంజనీరింగ్‌ అధికారులకే ఆప్షన్‌ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన సంస్థలు వాదిస్తుంటే .. తెలుగు రాష్ట్రాల్లోని ఇంధన సంస్థల ఇంజనీరింగ్‌ అధికారులందరికీ ఆప్షన్లు ఉండాలని ఏపీ ఇంధన సంస్థలు వాదిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారి నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ మంగళ, బుధవారాల్లో విజయవాడలో రాష్ట్ర విద్యుత్తు సంస్థల ఇంజనీరింగ్‌ అధికారుల అభిప్రాయాలను సేకరించింది.
 
‘తెలంగాణలో సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంది. ఆంధ్రా ప్రాంతంవారు తెలంగాణను ఎంపిక చేసుకోవద్దు. అందరూ హైదరాబాద్‌ను చూసి అక్కడకి వచ్చేద్దామనుకుంటున్నారు. కానీ, ఉద్యోగులందరినీ హైదరాబాద్‌లోనే పోస్టింగ్‌ ఇవ్వాలన్న నిబంధనేమీలేదు. తెలంగాణ జిల్లాలకూ పంపించొచ్చు. మా జిల్లాల్లో సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంది. అక్కడ ఉద్యోగం చేయడం ఆంధ్రా ప్రాంతంవారికి కష్టమే. స్థానికత ఆధారంగానే ఉద్యోగాలు ఉండాలి. ఆంధ్రా ప్రాంతంవారు తెలంగాణ ఆప్షన్‌ను కోరుకోవద్దు.’ అని ఈ సందర్భంగా తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పేర్కొన్నారు.

న్యాయమూర్తుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్తు సంస్థలకూ వర్తిస్తాయని ఏపీ జెన్కో సీఎండీ కె.విజయానంద్‌ అన్నారు. ‘ఉద్యోగాల భర్తీ సమయంలో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరాం. స్థానికత ఆధారంగా దరఖాస్తులు కోరలేదు. న్యాయమూర్తుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ, తెలంగాణ విద్యుత్తు సంస్థలకూ వర్తిస్తాయి. ఈ ప్రకారం ఏపీ, తెలంగాణ విద్యుత్తు సంస్థల ఉద్యోగులందరికీ ఎక్కడ పనిచేయదలచుకున్నారోనన్న సమాచారం సేకరించాల్సి ఉంది. స్థానికత పేరిట తెలంగాణ తీసేసిన ఉద్యోగులకు మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల విద్యుత్తు సంస్థల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇచ్చి తీరాల్సిందే ’ అని ఆయన వాదించారు. ఈ వివాదం ఎప్పుడు తేలుతుందో ఏంటో.