బాబూ మీకో దండం..

 

ఒకపక్క బైక్ పై వెళ్లేప్పుడు హెల్మెట్లు పెట్టుకోవాలని... పెట్టుకోని వాళ్లకు జరిమానా ఉంటుంది.. ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అని రోజూ అవగాహనా కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నా కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే కొంతమంది మాత్రం మారరు అని అనిపిస్తుంది. అలాంటి ఘటనే అనంతపురంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా మడకశిరలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహనా కార్యక్రమానికి హాజరై వస్తున్న సీఐ శుభ కుమార్ కి రోడ్డు మీద కనబడిన " శుభ " దృశ్యమిది. ఓ వ్యక్తి బైక్ పై వెళుతున్నాడు. హెల్మెట్ లేదు. పోనీ బెక్ పై ఒక్కరు ఉన్నారా..? అదీ కాదు.. ఏకంగా ఐదుగురితో వెళుతున్నాడు ఆ మహానుభావుడు. ఈ దృశ్యం చూసిన సీఐ గారికి ఏం మాట్లాడాలో కూడా తెలీక... నోటి వెంట మాటరాకుండా అలానే ఉండిపోయారు. ఇక వారికి అర్ధమయ్యేట్టు... ఎలా చెప్పాలో తెలియక ఆ పోలీసాయన చేతులెత్తి దండం పెట్టేశాడు. మీకు ఇంకెలా చెప్పాలి ఇంతకంటే " అన్నట్టు నమస్కారాలు పెట్టాడు. ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది.