కరోనా చికిత్స అధ్వాన్నంగా ఉంది.. మంత్రి ముందే కడిగేసిన వైసిపి ఎమ్మెల్యే

కరోనా వ్యవహారంలో ఏపీ సర్కార్ తీరు పై వైసిపి ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. నిన్న అనంతపురం లో మంత్రి ఆళ్ల నాని కోవిడ్ పై సమీక్ష నిర్వహించిన సందర్భం లో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. "అందరూ ఏదో అంతా బాగానే ఉంది. అన్నీ సవ్యంగా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కాని అది నిజం కాదు. జిల్లాలో ని ఒక్క ఆస్పత్రి తప్ప.. మిగతా అన్నిటిలోనూ బాధితులకు వైద్య సేవలు సరిగా అందడం లేదు. ఎక్కడా అసలు సరైన సౌకర్యాలు కూడా లేవు. అంతే కాదు పేషెంట్లకు అందించే ఫుడ్ కూడా బావుండడం లేదు. ఇక డాక్టర్లు, నర్సులు.. పేషెంట్లు ఉన్న రూముల్లోకే వెళ్లటం లేదు. ఇలా అయితే కష్టం" అంటూ సమీక్ష చేస్తున్న మంత్రి ముందే మొత్తం ఉన్నదున్నట్లు కడిగిపారేశారు. దీంతో షాక్ కు గురైన మంత్రి మెల్లగా తేరుకుని ఎమ్మెల్యే గారు చెప్పారు కదా.. వెంటనే తగిన చర్యలు తీసుకోండి అని ముగించేశారు. అయినా పాపం అయన మాత్రం ఏం చేస్తారు .. ఆయనకు కూడా తెలుసు వాస్తవ పరిస్ధితేమిటో.

 

ఏపీలో కరోనా కేసుల లెక్కలు కూడా తేడాలొస్తున్నాయని ఒక పక్క మీడియా కోడై కూస్తోంది. జిల్లాల అధికారులు ఇచ్చే రిపోర్టుకు.. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే రిపోర్టుకు కూడా తేడాలుంటున్నాయని తాజాగా బయటపడింది. దీంతో ఇంకెన్ని కేసులు ఉన్నాయో.. అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అంతే కాకుండా.. కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఉన్న యంత్రాంగం.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వారిని గుర్తించి టెస్టులు చేయడం సాధ్యం కావడం లేదు. దీంతో అనుమానం ఉన్నవారే వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు. అలా కాకపోతే తమ చుట్టూ కేసులొచ్చిన చుట్టుపక్కలవారు కూడా వారంతట వారే వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు. ఐతే ఈ టెస్టుల రిపోర్టులు కూడా ఎప్పటికో వస్తున్నాయి. అంతే కాకుండా టెస్టులు కూడా సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అదేమంటే టెస్టులు ఎక్కువగా చేస్తున్నామని చెపుతున్నారు. ఇది ఇలా ఉండగా పేషెంట్లు.. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లడానికి భయపడి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలు లక్షలు సమర్పించుకుంటున్నారు. మన ముందు ఢిల్లీ, కేరళ సక్సెస్ అయిన ఉదాహరణలు కనపడుతున్నా అవి పట్టించుకోకుండా ఇంట్లోనే ఉండండి, కరోనాతో సహజీవనం తప్పదు, అందరికీ రాక తప్పదు వంటి డైలాగులతో ప్రభుత్వం కాలం గడిపేస్తోందని.. అధికార పార్టీ నేతలు ఎవరికి కరోనా వచ్చినా.. ఐతే హైదరాబాద్ లేదంటే చెన్నై పరిగెడుతున్నారు.. అంటే వారికీ ఇక్కడ చికిత్స పైన నమ్మకం లేకే గదా అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు తాజాగా ఎమ్మెల్యే కరణం బలరాం హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందుతున్నారు.