ఆనం వర్సెస్ అనిల్...! సింహపురి వైసీపీలో కలకలం...

 

 

సింహపురి వైసీపీలో మరోసారి కలకలం రేగింది. ఇంతకుముందు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి వెంకట్ రెడ్డి... కాకాని గోవర్దన్ రెడ్డి మధ్య రగడతో నెల్లూరు వైసీపీలో ఆధిపత్య పోరు బయటపడగా, ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన హాట్ కామెంట్స్ మరో వర్గం అంతుర్యుద్ధాన్ని బయటపెట్టింది. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి రండి... అదే మాఫియా కావాలంటే నెల్లూరు వెళ్లాలంటూ ఆనం చేసిన వ్యాఖ్యలు.... మంత్రి అనిల్ అండ్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఉద్దేశించేనంటున్నారు. లిక్కర్ మాఫియా, బెట్టింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా... ఇలా ఒక్కటేమిటి... ఏ రకం మాఫియా కావాలన్నా... నెల్లూరులో దొరుకుతారంటూ ఆనం సంచలన ఆరోపణలు చేశారు. ఈ మాఫియాల కారణంగా వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారని, ఈ మాఫియాల ఆగడాలను అడ్డుకోవాలంటే సమర్ధుడైన పోలీస్ ఆఫీసర్ రావాలంటూ ఆనం వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఉద్దేశించే ఆనం ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది.

మంత్రి అనిల్... ఎమ్మెల్యే ఆనం మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. సింహపురి రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ గా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకి మంత్రి అనిల్ చుక్కలు చూపిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ఆనం పేరు వినిపించకుండా చేసేందుకు అనిల్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే, జిల్లాలో ఆనం కుటుంబ పెత్తనం ఎక్కడుందో గుర్తించి కట్టడి చేస్తున్నారట. అందులో భాగంగా, దశబ్దాలుగా ఆనం కుటుంబ పెత్తనమున్న వీఆర్ విద్యాసంస్థల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని మంత్రి అనిల్ తెరపైకి తెచ్చారు. ఇదే ఆనం ఆగ్రహానికి కారణమనే టాక్ వినిబడుతోంది. అలాగే, తన నియోజకవర్గమైన వెంకటగిరి పరిధిలోని ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం విషయంలోనూ మంత్రి అనిల్ జోక్యం చేసుకోవడం కూడా ఆనం ఆగ్రహానికి కారణమంటున్నారు.

అయితే, ఆనం అండ్ కాకాని ఒక వర్గంగా.... అనిల్ అండ్ కోటంరెడ్డి మరో వర్గంగా... నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వర్గపోరు నడుస్తోందని జనం మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు కోటంరెడ్డి - కాకాని మధ్య రగడ రోడ్డునపడితే... ఇప్పుడు ఆనం - అనిల్ మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరు బయటపడిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ నలుగురు నేతల మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే పార్టీకి మంచిది కాదని, ఆదిలోనే దీన్ని అరికట్టాల్సిన అవసరముందని, సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించుకుని సరిచేయాలని సింహపురి వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. లేదంటే నెల్లూరు జిల్లాలో వైసీపీ పరువు పోవడం ఖాయమంటున్నారు.