ఆనం బ్రదర్స్ 'సైకిల్' మీద కూర్చోలేకపోతున్నారా?

 

రన్నింగ్ బస్ ఎక్కటం వచ్చిన వారు ఏం చేస్తుంటారు? ఎదురుగా ఏ బస్ కనిపిస్తే దాంట్లో అమాంతం ఎక్కేస్తుంటారు. మళ్లీ అందులోంచి దూకి ఇంకో దాంట్లో ఎక్కేస్తుంటారు! రాను రాను రాజకీయ నాయకుల పరిస్థితి కూడా రన్నింగ్ బస్ ఎక్కే ఫుట్ బోర్డ్ బాపతు ప్రయాణికుల్లా తయారవుతోంది! మరీ ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఏ నేతని చూసినా అధికారం పక్షం అనే బస్సు వైపే దృష్టి పెడుతున్నారు. పరుగెత్తికెళ్లి రన్నింగ్ బస్ ఎక్కేసినట్టు ఎక్కేస్తున్నారు. ఆనం సోదరులు కూడా ఈ కోవలోకే వస్తారు...

 

వైఎస్ హయాంలో మొదలు కిరణ్ కుమార్ రెడ్డి వరకూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక వెలుగు వెలిగారు ఆనం బ్రదర్స్. సమైక్య రాష్ట్రంలో నెల్లూరు అంటే ఆనం వారిదేనన్న ఫీలింగ్ కలిగింది అందరికీ. అయితే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రాలో కాంగ్రెస్ ను మళ్లీ పుట్టగతులు లేకుండా పూడ్చి పెట్టేసుకుంది. ఆ ఎఫెక్ట్ ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి మీద కూడా పడింది! ఎన్నికల్లో గెలుపు లేక, చేతిలో పదవుల్లేక, ఏం చేయాలన్నా అధికారం లేక... అసలు ఏపీలో తమ కాంగ్రెస్ పార్టీయే లేక ఆనం వారు ఆగమాగం అయిపోయారు. చివరకు, అనేక తర్జనభర్జనల తరువాత టీడీపీలోకి జంప్ కొట్టారు. వీళ్లలా చాలా మందే అధికార పక్షంలోకి వచ్చారు నవ్యాంధ్రలో. కాని, కాంగ్రెస్ లో నెల్లూరు మారాజుల్లా బతికిన ఆనం సోదరులకి టీడీపీలో అడ్జెస్ట్ అవ్వటం కష్టంగానే వుందట! ఎంతగా అంటే, వివేకానంద రెడ్డి కంటతడి పెట్టుకునేంతగా!

 

అధికారంలో వున్న టీడీపీ పుల్ స్పీడ్ తో పరుగెడుతుంటే రన్నింగ్ బస్ ఎక్కేసిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు ఎలాంటి పవర్స్ లేక తల్లడిల్లిపోతున్నారని టాక్. చంద్రబాబు ఆనం వార్ని పార్టీలోకి అయితే తీసుకున్నారుగాని వారికి కీలకమైన బాధ్యతలు అప్పజెప్పిందీ ఏమీ లేదు. చివరకు, వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన గతంలో ఇచ్చిన మాట కూడా నిజమయ్యే పరిస్థితి లేదట. గత ప్రభుత్వాల కాలంలో క్యాబినేట్లో సత్తా చాటిన వారికి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అందీ అందక ఊరించటం... నిజంగానే నిస్పృహకు కారణం అవుతుంది. అది అర్థం చేసుకోవచ్చు!

 

ఎమ్మెల్సీ రానందుకు వివేకానంద రెడ్డి తన వారి వద్ద కంటతడి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా... పార్టీలు చకచకా మారిపోయే లీడర్లందరూ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. కొత్త పార్టీలో చేరటం అంత ఈజీ కాదు అక్కడ అప్పటికే వున్న వారితో అడ్జెస్ట్ కావటం!