టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు కిమ్మనడం లేదు? అమిత్‌‌షాకి భయపడుతున్నారా?

 

కమల దళపతి రావడం రావడమే టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేశారు. ఏదో ఆషామాషీగా తెలంగాణ పర్యటనకు రాలేదనే స్ట్రాంగ్‌ సంకేతాలు పంపారు. మొదటి రోజే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ లక్ష్యం 2019నే అంటూ నేరుగా టీఆర్‌ఎస్‌కే సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం కాస్కోమంటూ గులాబీ దళానికి హెచ్చరికలు పంపారు. కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్న అమిత్‌షా... కనీసం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో సరిగా అమలు కావడం లేదన్న కమల దళపతి.... కేంద్రంలోనూ... రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ....అధికారంలో ఉంటే ఇలాంటి సమస్య ఉండదని, మరింత అభివృద్ధి జరుగుతుందంటూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను టార్గెట్ చేశారు.

 

కమల దళపతి కాలు దువ్వుతున్నా గులాబీ నేతలు మాత్రం కిమ్మనడం లేదు. అమిత్ షా ఆరోపణలపై స్పందించే లీడరే కనిపించడం లేదు. అమిత్ షా తొలి రోజే కాకపుట్టించే ప్రసంగం చేసినా టీఆర్ఎస్ లీడర్లు మాత్రం కౌంటర్‌ ఇచ్చేందుకు సాహసించలేకపోయారు. రాష్ట్ర నేతలు, విపక్ష లీడర్లు చేసే చిన్నచిన్న ఆరోపణలకే ఘాటుగా కౌంటర్‌ ఇచ్చే టీఆర్‌ఎస్‌ నేతలు... అమిత్‌షా విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు, ఎంపీలను  స్పందించమంటే... మంత్రులు చూసుకుంటారని..... మంత్రులను అడిగితే హైకమాండ్‌ చూసుకుంటుందని మాట దాట వేస్తున్నారు.

 

టీఆర్ఎస్ నిజంగానే బీజేపీకి భయపడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్‌షా నుంచి ఈ స్థాయిలో దాడి ఉంటుందని టీఆర్ఎస్ ఊహించలేకపోయిందా? లేదంటే కమల దళపతి అనూహ్యంగా విసిరిన సవాల్‌తో డిఫెన్స్ లో పడిపోయిందో తెలియడం లేదు. తెలంగాణలో నిజంగానే కేంద్ర పథకాలు అమలు కావడం లేదా? సొంత పథకాల కోసం కేంద్ర పథకాలను పక్కన పెడుతున్నారా..? అమిత్ షా ఆరోపణలకు టీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదా? తెలంగాణలో ఎవరొచ్చినా భయం లేదన్న నాయకులు ఇప్పుడెందుకు సైలెంటైపోయారు... ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.