అమితాబ్‌కు కష్టాలు తప్పవా..?

సరిగ్గా ఏడాది క్రితం.."పనామా పేపర్స్" పేరిట చట్టప్రకారం దేశానికి చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న ఎంతోమంది పెద్దమనుషుల బాగోతాలను "ది ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్" వెలువరించిన కథనాలతో ప్రపంచం ఉలిక్కిపడింది. 76 దేశాలకు చెందిన 375 మంది జర్నలిస్టుల బృందం ప్రపంచవ్యాప్తంగా నల్లధనం దాచుకున్న వారి వివరాలను బహిర్గతం చేసింది. ఈ లిస్ట్‌లో ఐర్లాండ్ ప్రధాని, పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్, సౌదీ అరేబియా రాజులతో పాటు మనదేశానికి చెందిన సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్. ఐశ్వర్యరాయ్ తదితరుల పేర్లను వెల్లడించింది. దీంతో పాటు సెకండ్ లిస్ట్‌లో మరింత మంది పెద్ద పెద్ద తలకాయలను బయటకు తెచ్చింది.

 

అయితే తదనంతర కాలంలో పనామా పేపర్స్ ఎలాంటి చప్పుడు చేయకపోవడంతో విషయం మరుగున పడిపోయిందని అంతా భావించారు. కానీ తాజాగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు పదవి నుంచి తప్పించడంతో పనామా పేపర్స్‌‌ గురించి ఇండియాలో చర్చించుకోవడం మొదలెట్టారు. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ సీరియస్‌గా రంగంలోకి దిగి 33 మందిపై చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా నాటి నుంచి ప్రముఖంగా వినిపించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఈ వ్యవహారంలో చిక్కులు తప్పేట్లు లేవు.  అమితాబ్, ఐశ్వర్యరాయ్, అజయ్ దేవగణ్ తదితరులు వర్జిన్ ఐలాండ్స్‌లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయలను అక్రమ మార్గాల్లో దేశం దాటించారన్నది పనామా పేపర్స్ చేసిన ఆరోపణ.

 

ఈ వ్యవహారంలో నిజాలను రాబట్టేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని బ్రిటీష్ వర్జిన్ ల్యాండ్‌కు పంపింది భారత ప్రభుత్వం. ఆ బృందం ఇచ్చే నివేదికను బట్టి వీరందరిపై చర్యలుంటాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పనామా పేపర్స్ స్కాం పేరుతో విడుదల చేసిన జాబితాపై అమితాబ్ అప్పట్లోనే స్పందించారు. విదేశీ నౌకాయాన కంపెనీలకు తాను డైరెక్టర్‌గా నియమించబడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఏ కంపెనీకి పనిచేయడం లేదని..ఎవరో కావాలనే తన పేరును జాబితాలో చేర్చారన్నారు. నిజానిజాలు తెలియాలంటే..ఇండియాలో పెద్ద మనుషుల ముసుగు తొలగాలంటే వర్జినీయా ఐలాండ్స్ వెళ్లిన బృందం తిరిగి రావాల్సిందే.