ఆ భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు - అమిత్‌షా

 

తెలంగాణాలో ఎన్నికల సమయం దగ్గర పడడంతో బీజేపీ కూడా తెలంగాణ మీద ఫోకస్ పెడుతుంది. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ హవాలో కొట్టుకుపోతాననే భయంతోనే కెసీఆర్ ముందస్తుకు వెళ్లారని విమర్శించారు. కేసీఆర్ తన కొడుకు, కూతురునో సీఎం చేసుకోవాలని ఆశపడుతున్నారని, ఆయన ఆశలు నెరవేరవని అమిత్‌షా అన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై పడుతున్న ఆర్ధిక భారానికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ చెబుతున్న ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ లతో బీసీలు నష్టపోతారని అన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌లను అడ్డుకుంటామన్నారు. కేసీఆర్ వాస్తవాలు మాట్లాడాలన్నారు. తెలంగాణపై మోదీ వివక్ష చూపుతున్నారంటూ అబద్దాలు మాట్లాడుతున్నారని, నాలుగున్నర ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన లక్ష పదిహేను వేల కోట్లు సంగతి మరిచారా? అని అమిత్ షా ప్రశ్నించారు.