అసద్ ఇలాకాలో షా అస్త్రం... ఒకే దెబ్బకు రెండు పిట్టలు...

కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి మొదటి వారంలో తెలంగాణ బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గోనున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళ‌నల‌కు కార‌ణ‌మ‌వుతున్న సీఏఏపై అనుమానాలు తొల‌గించేందుకు నిర్వహిస్తున్న ఈ సభలో.... ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనేది సర్వత్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

సీఏఏ వ్యతిరేకతను భారీస్థాయిలో చాటాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో, దీనికి వ్యతిరేకంగా సభ పెడితే, అందుకు అమిత్ షా వస్తే, పోలరైజేషన్‌తో, పార్టీ మూలాలు మరింత బలపడతాయని భావిస్తోంది రాష్ట్ర నాయకత్వం. అందుకే భారీ ఎత్తున సీఏఏ అనుకూల సభను నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ స‌భ‌లో, అమిత్ షాతోపాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ సైతం పాల్గొనబోతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బీజేపీ, జన‌సేన క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణయించుకున్న త‌రువాత జ‌ర‌గ‌బోతున్న, మొద‌టి సభ ఇదే కావ‌డంతో స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది. 

పార్లమెంట్ వేదిక‌గా సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతుల‌ను చించి నిర‌స‌న తెలిపిన అసదుద్దీన్ ఇలాకాలోనే, ఈ స‌భ నిర్వహించ‌బోతున్నారట. ఇప్పటికే ఎంఐఎంతోపాటు ఇత‌ర ముస్లిం సంఘాలు నిర్వహించిన స‌భ‌లు స‌క్సెస్ కావ‌డంతో, సీఏఏ అనుకూల స‌భ‌కు భారీగా జ‌నస‌మీక‌ర‌ణ చేసి స‌క్సెస్ చెయ్యాలని భావిస్తోంది రాష్ట్ర బీజేపీ. ఇందుకోసం ఇప్పటి నుంచే సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

అయితే, ఈ సభలో అమిత్ షా స్పీచ్ ఎలా ఉండబోతుందని ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ వేదికగా జరుగనున్న ఈ సభలో వివాదాస్పద వ్యాఖ్యలకు ఛాన్స్ లేకపోలేదు. పైగా కేసీఆర్, అసద్‌లను ఓ రేంజులో టార్గెట్ చేసే అవకాశముంది. ఇక, పవన్ తొలిసారి తెలంగాణ గడ్డపై అమిత్‌ షాతో కలిసి సభలో పాల్గొనబోతుండటం కూడా, ఈ సభపై ఉత్కంఠను పెంచుతోంది.