మాట్లాడే హక్కు లేదంటున్న షా...ప్రశ్నించడానికి మీరెవరంటున్న బాబు..


ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా మిత్రపక్షంగా బీజేపీ-టీడీపీ విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇక విడిపోయిన దగ్గరనుండి రెండు పార్టీల నేతల పోటీ పడి మరీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు. ఏపీకి మేము అంతిచ్చాం... ఇంతిచ్చాం... అని ఒకపక్క బీజేపీ మొత్తుకుంటుంటే.. అసలు మీరు మాకు ఏం ఇచ్చారయ్యా బాబు అంటూ బీజేపీపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి అమిత్ షా.. చంద్రబాబు నువ్వా నేనా అన్నట్టుగా విమర్సలు గుప్పించుకున్నారు.

 

ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన... ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 2,100 కోట్లను ఇచ్చిందని, వాటి లెక్కలు ఇంతవరకూ కేంద్రానికి చేరలేదని, ఆ పరిస్థితుల్లో మరిన్ని డబ్బులు ఎలా ఇస్తారని అడిగారు. ఒక్క భవన నిర్మాణానికైనా టెండర్లు పిలిచారా? అని అమిత్ షా ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే స్వీయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు కావని అన్నారు. చంద్రబాబు పలు సార్లు రాజధాని నిర్మాణం కోసమంటూ తయారుచేయించిన డిజైన్లన్నీ నేటికీ సింగపూర్ దగ్గరే ఉన్నాయని... ఇప్పటికీ సింగపూర్ ను దాటి బయటకు రాలేదని విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబుకు గుజరాత్ లో అభివృద్ధి చెందిన నగరాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గుజరాత్ నగరాలన్నీ రాష్ట్ర నిధులతోనే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లనున్నామని, కొత్త మిత్రపక్షాలేమీ ఉండబోవని స్పష్టం చేశారు.

 

ఇక షా చేసిన విమర్శలపై స్పందించిన చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎపీ ప్రభుత్వం యుటిలిజైషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని అమిత్ షా చెప్పడం సరికాదన్నారు. అసలు అమిత్ షా ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడని, ఆయనకు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదన్నారు. అమరావతిలోని రాజధాని భవనాలకు తాము ఇప్పటికే టెండర్లు పిలిచామని.. వివరాలు తెలియకుండా అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. అసలు ఎపి ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు.. అయినా యూసీల విషయంలో ప్రధాని అడిగితే తాను సమాధానం చెబుతానని, వాటి గురించి అడగడానికి అమిత్ షా ఎవరిని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఏకంగా చంద్రబాబు షాకి వార్నింగ్ ఇవ్వడంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం ముందు ముందు ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని కీలక మలుపులు చోటుచేసుకుంటాయో..