నోరు జారుతున్నారా..? నిజాలు చెబుతున్నారా..?


రాజకీయ నాయకులు నోరు జారడం కామన్ థింగే. కాస్త తడబాటులో నోరు జారుతుంటారు. నోరు జారి.. ఆ తరువాత పొరపాటును గ్రహిస్తారు. అదేంటో ఈ మధ్య బీజేపీ నేతలు తెగ నోరుజారుతున్నారు. నోరు జారితే జారారు... కానీ మోడీ పరువును అడ్డంగా తీసేస్తున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకు వచ్చినప్పుడు ఓ సభలో పాల్గొన్నారు. ఇక సభలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెసు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ అత్యంత అవినీతికరమైన ప్రభత్వం ఏది అని పోటీ పెడితే యడ్యూరప్ప ప్రభుత్వం మొదటి స్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యానించి అందరికీ షాకిచ్చాడు. ఇక షా పక్కనే కూర్చున్న యడ్యూరప్ప అయితే ఒక్కసారిగా ఖంగుతిని షా వైపు చూడగా.... తప్పు తెలుసుకున్న అమిత్ షా.. తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమిత్ షా చేసిన వ్యాఖ్యల వీడియో వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరూ సెటైర్లు విసిరారు. 

 

ఇప్పుడు మరోనేత అలాగే నోరుజారి మోడీ పరువు తీసేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి కర్ణాటకలోని ఓ సభలో పాల్గొనేందుకు వచ్చారు. అయితే ఈసారి ఆయన  ప్రహ్లాద్ జోషి అనే ట్రాన్స్ లేటర్ ను పెట్టుకున్నారు. ఇక అమిత్ షా హిందీలో మాట్లాడుతుండగా.. ప్రహ్లాద్ జోషి కన్నడలో అనువదించారు. ఈ సందర్భంగా అమిత్  షా 'సిద్దరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అభివ్రుద్ధి చేయదు. మీరు ప్రధాని మోదీ పట్ల విశ్వాసం ఉంచి బీఎస్ యెడ్యూరప్పకు ఓటేయండి. మేం కర్ణాటక రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం' అని అన్నారు. దానికి ప్రహ్లాద్ జోషి.. 'ప్రధాని నరేంద్రమోదీ దళితులు, పేదలు, బలహీన వర్గాల వారికి ఏమీ చేయరు. ఆయన వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుంది. దయచేసి ఆయనకు ఓటేయండి' అని అమిత్ షా అన్నారని కన్నడ భాషలో చెప్పారు. ఆ తరువాత తప్పు గ్రహించి...మళ్లీ ఆ వ్యాఖ్యలు సరిచేశారనుకోండి. మొత్తానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని కలలు కంటున్న మోడీకి పార్టీ నేతలే నష్టం తెచ్చిపెడుతున్నారు. ఇప్పటికే మోడీకి పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి తోడు పార్టీ నేతలే ఉన్న పరువు కాస్త తీసేస్తున్నారు.