బీజేపీ గెలుపుని అమెరికా ముందే పసిగట్టిందా?

 

భారతదేశంలో చాలామంది ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా బీజేపీ విజయంపై, నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఇంకా సందిగ్ధంలో ఉన్నపటికీ, ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల అమెరికా మాత్రం రానున్న ఎన్నికలలో బీజేపీ గెలుపుని, అలాగే నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ముందే పసిగట్టేసింది. అందుకే ఇంతకాలంగా మోడీకి వీసా నిరాకరించి తమ దేశంలో అడుగుపెట్టడానికి కూడా ఒప్పుకోని అమెరికా, ఇప్పుడు తన భారతదేశ రాయబారి నాన్సీ పావెల్ ను ఆయన వద్దకు ‘ద్వైపాక్షిక సంబంధాల’ గురించి మాట్లాడే మిషతో పంపిస్తోంది. ఎన్నికల గంట మ్రోగక ముందే అమెరికా మోడీతో ‘ద్వైపాక్షిక సంబంధాల’ గురించి మాట్లాడాలనుకోవడం, ఆయనే ప్రధాన మంత్రి కాబోతున్నారని అమెరికా నిరదారించుకొందని అర్ధమవుతోంది. అలా కాకుంటే, ‘ద్వైపాక్షిక సంబంధాల’ గురించి ఆయనతో కాక యువరాజు రాహుల్ గాంధీతో మాట్లాడాలని భావించేది.

 

ఇది బీజేపీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి సానుకూల అంశమవుతుంది. అమెరికా అభ్యర్ధన మేరకు విదేశాంగశాఖ మంత్రి సల్మాన్ కుర్షీద్, తన మంత్రిత్వ శాఖ ద్వారానే మోడీతో నాన్సీ పావెల్ కు సమావేశం ఏర్పాటు చేయవలసిరావడం కాంగ్రెస్ పార్టీకి పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. అది కుర్షీద్ మాటలలోనే వ్యక్తమయింది. “ఇదివరకు వారు (అమెరికా) గుజరాత్ అల్లర్లలో ఆయన ప్రమేయం గురించి చాలా మాట్లాడారు. కానీ, మళ్ళీ ఇప్పుడు ఆయనతోనే మరెందుకో సమావేశామవ్వాలనుకొంటున్నారు. పావెల్ ఈ సమావేశంలో మోడీతో ఏమీ మాట్లాడబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉందు.”

 

ఇంతకాలంగా అమెరికా నరేంద్ర మోడీని దూరంగా అట్టేబెట్టినప్పటికీ, ఇంగ్లాండ్ ,జపాన్, దక్షిణ కొరియా, అనేక యూరోపియన్ దేశాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ‘నమో నరేంద్ర మోడీ’ అంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. నరేంద్ర మోడీ భారత్ ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న ఈ తరుణంలో కూడా ఇంకా బిగదీసుకొని కూర్చొంటే, నష్టపోయేది తమ వ్యాపార సంస్థలేనని, ఒక దేశ ప్రధానికి వీసా నిరాకరిస్తూ ఆ దేశంతో ‘ద్వైపాక్షిక సంబంధాలను’ నడపడం అసాధ్యమనే జ్ఞానోదయం అమెరికాకి నేటికి కలగడంతో, అమెరికా కూడా ‘నమో!నమో!’ అంటూ మోడీ గుమ్మం ముందు నిలబడేందుకు సిద్దమయిపోయింది.