ఐసీయూకి చేరిన ఐసిస్!

 

ఆదివారం ప్రపంచం పెద్దగా పట్టించుకోని ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది! ఇరాక్ సేనలు మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి! మోసుల్ ప్రపంచ పటంలో మహానగరమేం కాదు. కాని, అది ఐఎస్ఐఎస్ ఉన్మాదుల రాజధాని! అక్కడ్నుంచే ప్రపంచం మొత్తాన్ని ముస్లిమ్ సామ్రాజ్యంగా మార్చేస్తామని ఐఎస్ అధినేత బాగ్దాదీ ప్రకటించాడు కూడా! అటువంటి అత్యంత ప్రధానమైన నగరం ఇప్పుడు ఐఎస్ కు లేకుండా పోయింది. కేవలం కొన్ని చిన్న చిన్న ఇరాకీ ఊళ్లు, ఎడారి ప్రాంతం మాత్రం మిగిలింది. ఒక విధంగా చూస్తే మోసుల్ ఐఎస్ సంస్థ చేతి నుంచి జారిపోవటంతో దాని పని అయిపోయినట్టే! కాని, ఉగ్రవాదంపై యుద్దంలో ఒక పోరు ముగిసింది. మరెన్నో పోరాటాలు మిగిలే వున్నాయి!

 

ఒకవైపు ఇరాకీ సైన్యం అమెరికా సాయంతో ఐఎస్ ను ఓడించి మోసుల్ తిరిగి రాబట్టుకుంటే… అదే సమయంలో ప్రపంచ క్రిస్టియన్లంతా ఎంతో గౌరవించే పోప్ ఏమన్నారో తెలుసా? ఆయన ఐఎస్ ను,ఇరాక్ ను ఉద్దేశించి ఏమనకున్నా అమెరికా, రష్యా, ఉత్తర కొరియా, చైనాలు ఒకే గూటి పక్షులని విమర్శించారు! ఆ నాలుగు దేశాలు కావాలనే ప్రపంచంలో ఎక్కడో ఓ చోట యుద్ధం జరిగేలా చేసి .. మళ్లీ పెద్ద మనుషుల రూపంలో వెళ్లి ఆపుతున్నాయని సూటిగా, స్పష్టంగానే చెప్పేశారు! సిరియా లాంటి చిన్న చిన్న దేశాలపై అమెరికా యుద్దం చేసి తన స్వంత లాభం చూసుకుంటోందని పోప్ అన్నారు!

 

పోప్ మాత్రమే కాదు… ప్రపంచంలోని చాలా మంది అమెరికా లాంటి అగ్రదేశాల కుట్రల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే వున్నారు. ఐసిస్ అసలు పుట్టిందే అమెరికా ఉన్మాదం వల్ల! సిరియా, లిబియా లాంటి దేశాల్లో వున్న నియంతలకి వ్యతిరేకంగా ఉద్యమాలు సృష్టించి, వాటికి మద్దతిచ్చి , ఆ దేశాల్ని ఛిన్నాభిన్నం చేసింది. అక్కడున్న చమురు ఇప్పుడు హాయిగా వాడుకుంటోంది. కాని, అమెరికా సాయంతో ఆయుధాలు పట్టుకుని రెచ్చిపోయిన ఉన్మాదులు తరువాతి కాలంలో మళ్లీ జనంపై పడ్డారు. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఐఎస్ఐఎస్ ఏర్పాటై, లక్షల మంది జీవితాల్ని సర్వనాశనం చేసిందన్నది బహిరంగ రహస్యం! ఇప్పుడు తనే ప్రపంచం మీదకి వదిలిన ఇస్లామిక్ స్టేట్ ను అమెరికా ఇరాకీ సేనల్ని బలి చేసి అంతం చేసింది! మోసుల్ ఇరాక్ ప్రభుత్వానికి చిక్కటం ఒక విధంగా ఐఎస్ అంతమనే చెప్పాలి!

 

ఐసిస్ దెబ్బకి మోసుల్ లాంటి పురాతన నగరం దాదాపు 40శాతం ధ్వంసమైపోయిందట. అలాగే అక్కడి గల్లీ గల్లీలో శవాలు రోడ్లపై పడి కనిపిస్తున్నాయట. అవన్నీ జిహాద్ పేరుతో ఉన్మాదం సృష్టించిన ఉగ్రవాదులవే! ఇప్పుడు వారి చెర నుంచి బయటపడ్డా మోసుల్ నగరం కాని, ఇరాక్ కాని కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు. మరోవైపు అసలు ఐసిస్ మోసుల్ లో వున్న స్థావరం కోల్పోయినంత మాత్రాన అంతమైనట్టు కాదని కూడా కొందరంటున్నారు. అమెరికా, రష్యా, ఇతర అగ్రదేశాలు దొంగచాటుగా ఉగ్రవాదులకి మద్దతిస్తున్నంత కాలం ఏదో ఒక పేరుతో రక్తపాతం జరుగుతూనే వుంటుందని వారంటున్నారు! పోప్ మాటల సాక్షిగా అది కాదనలేని సత్యమే!